ప్రపంచ వ్యాప్తంగా ఏటా అనేక మంది గుండె జబ్బుల కారణంగా మృతి చెందుతున్నారు. చాలా మందికి హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయి. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు ఉండడం, ఒత్తిడిని ఎదుర్కోవడం, డయాబెటిస్, ఇతర సమస్యలు ఉండడం, ధూమపానం, మద్యపానం.. వంటి పలు కారణాల వల్ల చాలా మంది హార్ట్ ఎటాక్‌ల బారిన పడుతున్నారు. గుండె సమస్యలు వస్తున్నాయి. అయితే గుండె జబ్బులతో బాధపడేవారు వారంలో కనీసం 2 సార్లు ఆయిలీ ఫిష్‌ను తీసుకుంటే హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది.
ఆయిలీ ఫిష్ లో సాధారణంగానే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల గుండె జబ్బులు ఉన్నవారికి హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు 1/6వ వంతు వరకు తగ్గుతాయి. ఈ మేరకు సైంటిస్టులు 1,92,000 మందికి చెందిన వివరాలను సేకరించి విశ్లేషించారు. చివరకు ఆ వివరాలను వెల్లడించారు.
సైంటిస్టులు చేపట్టిన అధ్యయనంలో 1,92,000 మందిలో 52,000 మంది అప్పటికే గుండె జబ్బుల సమస్యలతో బాధపడుతుండగా వారిలో ఆయిలీ ఫిష్‌ను తిన్నవారిలో హార్ట్ ఎటాక్‌లు సంభవించే అవకాశాలు తగ్గినట్లు గుర్తించారు. అందువల్ల కార్డియో వాస్క్యులార్ డిసీజ్ (సీవీడీ) (గుండె జబ్బులు) ఉన్నవారు వారంలో కనీసం 2 సార్లు ఆయిలీ ఫిష్‌ను తినాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. ఈ మేరకు సైంటిస్టుల అధ్యయనం తాలూకు వివరాలను జామా ఇంటర్నల్ మెడిసిన్ అనే జర్నల్‌లోనూ ప్రచురించారు. దాదాపుగా 25 ఏళ్ల పాటు సైంటిస్టులు అధ్యయనం చేపట్టి ఈ వివరాలను వెల్లడించారు.
ఇక ఆయిలీ ఫిష్ అంటే ఇతర చేపలతో పోలిస్తే వీటి లివర్, జీర్ణవ్యవస్థలో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. అందువల్లే వాటిని ఆయిలీ ఫిష్ అంటారు. సాల్మన్, ట్రౌట్, ట్యూనా, స్వోర్డ్‌ఫిష్, మాకరెల్, సార్డైన్స్, హెర్రింగ్ వంటి చేపలు ఈ జాతికి చెందుతాయి.