రాజమౌళి తాజాగా తీసుకున్న నిర్ణయంతో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ డైలామాలో పడినట్లు తెలుస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ముందుగా ఈ సినిమాను ఈ ఏడాది జులై 30న విడుదల చేయాలనీ చిత్ర బృందం భావించింది. అయితే సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో సినిమా రిలీజ్ తేదీని వచ్చే ఏడాది జనవరి 8కి వాయిదా వేసినట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో వచ్చే సంక్రాంతి నాటికీ తమ సినిమాలను విడుదల చేయాలనీ భావిస్తోన్న హీరోలు డైలమాలో పడిపోయినట్లు కనిపిస్తోంది. సంక్రాంతి పండగ సమయానికి కాస్తా అటు, ఇటుగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబులు తమ సినిమాలను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సాధ్యమైనంత తొందరగా పూర్తిచేసి జనవరి నాటికీ విడుదల చేయాలనీ లక్ష్యంగా పెట్టుకున్నారు. సంక్రాంతి సమయంలో సినిమాలను విడుదల చేయడం ద్వారా బాగా కలిసి వస్తుండటంతో వంశీ పైడిపల్లి తెరకెక్కనున్న సినిమాను అదే సమయానికి విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే తాజాగా ఆర్ ఆర్ ఆర్ జనవరి 8న విడుదల చేయనున్నామనే ప్రకటనతో.. ఆ సినిమాతో పోటీ పడాలా వద్దా అనే డైలామాలో మహేష్ బాబు ఉన్నారు. గతంలో బాహుబలి 1సినిమా సమయంలో కూడా మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాను విడుదల చేసేందుకు సాహసం చేయలేక నెల రోజులు వాయిదా వేశారు. ఇప్పుడు కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ముందుగానే తన సినిమాను విడుదల చేసేందుకు మహేష్ బాబు మొగ్గు చూపుతున్నారు. క్రిస్మస్ సమయంలో తన సినిమా రిలీజ్ చేయాలనీ మహేష్ బాబు భావిస్తున్నారు.
ఇక, పవన్ కళ్యాణ్ ది కూడా అదే పరిస్థితి. క్రిష్ దర్శకత్వంలో పవన్ పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. పవన్ ఈ సినిమా షూటింగ్ కు తక్కువ సమయాన్ని మాత్రమే ఇవ్వడంతో శరవేగంగా సినిమాను రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాను కూడా పొంగల్ సమయంలోనే విడుదల చేయాలనీ క్రిష్ భావించారు. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తేదీ ప్రకటనతో.. పవన్ తన సినిమా తేదీని మార్చాలని క్రిష్ కు సూచించినట్లు తెలుస్తోంది. దీపావళి సందర్బంగా తన సినిమాను విడుదల చేయాలనీ చెప్పినట్లు సమాచారం. మొత్తానికి ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల తేదీ… రెండు సినిమాల రిలీజ్ డేట్స్ ను వాయిదా వేసేలా చేసిందని అంటున్నారు.