సిటీలో చైన్ స్నాచర్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. భాగ్యనగరంలో అలజడి సృష్టించిన ఇద్దరు చైన్ స్నాచర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులు విశాంత్, రాహుల్ ను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. గుల్బర్గా నుండి బైక్ పై ఈనెల 22 న చైన్ స్నాచర్స్ నగరానికి వచ్చినట్లు పేర్కొన్నారు.
పట్టుబడిన నిందితులు ఈనెల 22 న కొండాపూర్, మూసాపేట్, ఆర్సీపురంలో ముగ్గురు మహిళల గొలుసులు దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈనెల 25న ఇద్దరు బైక్ పై మియాపూర్ లోని మాతృశ్రీ కాలనీలో మహిళ గొలుసు నిందితులు లాక్కెళ్ళినట్లు గుర్తించారు. ఉషోదయ కాలనీలో మరో మహిళ గొలుసు లాగేందుకు ప్రయత్నించారు కానీ.. కుదరకపోవడంతో అక్కడి నుండి నిందితులు పరారయ్యారు.
చైన్స్ స్నాచర్ల కోసం ప్రత్యేక టీమ్స్ గా ఏర్పడి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాచుపల్లి నుండి లింగంపల్లి వరకు అన్ని వాహనాలను తనిఖీలు చేశారు.
పల్సర్ బైక్ పై వస్తున్న ఇద్దరు అనుమానస్పద వ్యక్తుల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసిన సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ యాదయ్య పై కత్తితో దాడి చేసి అక్కడి నుండి పరారయ్యారు చైన్ స్నాచర్లు. దీంతో చాకచక్యంగా ఇద్దరు చైన్ స్నాచర్లను అరెస్ట్ చేసారు రామచంద్రపురం పోలీసులు. మధ్యాహ్నం 1 గంటకు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర.