ఫిబ్రవరి 6 న తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఐటీ దాడులకు సంబంధించి ఐటీ శాఖ తన వెబ్సైట్ లో వివరాలు వెల్లడించింది. టీడీపీ నేతలతో పాటు, ప్రతిమా గ్రూప్స్ పై కూడా ఐటీ దాడులు జరిగాయి. ఆ దాడుల్లో పెద్దఎత్తున షెల్ కంపెనీలు గుర్తించినట్లు ఐటీ శాఖ పేర్కొంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన మూడు ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీలకు సంబంధించి దాదాపుగా 40 చోట్ల జరిపిన సోదాల్లో రూ. రెండు వేల కోట్లకు పైగా అవకతవకలను గుర్తించినట్లుగా ఆదాయపు పన్ను శాఖ అధికారికంగా ప్రకటించారు. తెలంగాణలో ప్రతిమ గ్రూప్ కంపెనీల ఓనర్.. టీఆర్ఎస్ కీలక నేత బోయినపల్లి వినోద్‌కుమార్ సమీప బంధువు బోయినపల్లి శ్రీనివాసరావు, కడప జిల్లా టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డికి చెందిన కంపెనీలపై, చంద్రబాబు మాజీ పర్సనల్ సెక్రెటరీ శ్రీనివాస్ ఇంటిపై ఈ నెల ఆరో తేదీ నుంచి సోదాలు జరిగాయి. వీటితో పాటు.. మరో కంపెనీకి పైనా సోదాలు చేసినట్లుగా.. ఐటీ శాఖ ప్రకటించింది. సోదాల్లో రూ.2వేల కోట్లకు పైగా అక్రమ లావాదేవీలను గుర్తించామని.. లావాదేవీలు జరిగిన విషయాన్ని ఈ మెయిల్, వాట్సాప్ సందేశాల ద్వారా గుర్తించామని ఐటీ శాఖ తెలిపింది. బోగస్ కంపెనీలు పెట్టి.. నకిలీ ఇన్వాయిస్‌లతో నగదు చెలామణి చేశారని.. ఓ కంపెనీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పేరుతో నిధులు సమీకరించిందని.. ఐటీ శాఖ తెలిపింది. ఓ ప్రముఖ వ్యక్తికి మాజీ పర్సనల్ సెక్రటరీ ఇంట్లోనూ సోదాలు చేసి.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని ఐటీ శాఖ తెలిపింది.
మొత్తంగా ఫిబ్రవరి 6 నుంచి మొత్తం 40 ప్రాంతాల్లో సోదాలు చేశామని ఐటీ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సోదాల్లో లెక్కలు చెప్పని రూ.85 లక్షల నగదు.. 71 లక్షల విలువైన ఆభరణాలు.. స్వాధీనం చేసుకున్నామని ఐటీ శాఖ తెలిపింది. అలాగే.. ఇరవై ఐదు బ్యాంక్ లాకర్లు గుర్తించినట్లుగా ఐటీ శాఖ తెలిపింది. ఇన్ఫ్రా కంపెనీల లావాదేవీలన్నీ.. సబ్ కాంట్రాక్టర్లకు చెల్లింపులు.. కొనుగోళ్లు.. వంటి అంశాలతో ముడిపడి ఉన్నట్లుగా తెలిపింది. అసలు టర్నోవర్ లేని కంపెనీలతో ఈ బోగస్ లావాదేవీలు నిర్వహించారని ఐటీ శాఖ ప్రకటించింది. గతంలోనూ ఐటీ శాఖ.. ఓ ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీపై సోదాలు చేసి.. ఇలానే రూ. రెండు,మూడు వేల కోట్ల అక్రమ లావాదేవీలు గుర్తించామని ప్రకటించింది. అప్పుడు బయటపడిన ఆధారాలకు కొనసాగింపుగా ఇప్పుడు.. సోదాలు చేసినట్లుగా తెలుస్తోంది. తదుపరి ఏం చర్యలు తీసుకుంటారన్నదానిపై ప్రకటనలో ఎలాంటి స్పష్టత లేదు. మరో పక్క నిన్న ఐటీ శాఖ వెల్లడించిన అక్రమాలు చంద్రబాబు మాజీ పర్సనల్ సెక్రెటరీ శ్రీనివాస్ కు సంబంధించినవి మాత్రమే అని వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.