హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ వరల్డ్ ఛాంపియన్ షిప్ ముగిసింది. ఈ ఫార్ములా ఛాంపియన్ షిప్ నగరంలోని రేసింగ్ అభిమానులకు కొత్త అనుభూతిని మిగిల్చింది.
ఈ రేసింగ్ ఛాంపియన్ షిప్‌లో జీన్ ఎరిక్ విజేతగా నిలవగా, నిక్ క్యాసిడీ, సెబాస్టియన్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. పోటీలను చూసేందుకు పలువురు క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు వచ్చారు.
టీమ్ ఇండియా దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, టాలీవుడ్ హీరో రామ్ చరణ్, హీరో మహేశ్ బాబు కుమారుడు గౌతమ్‌లు రేసింగ్ కు హాజరై సందడి చేశారు.
మరోవైపు దేశ, విదేశీ ప్రముఖులు ఈ పోటీలకు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక రేసింగ్ ఛాంపియన్ షిప్ నిర్వహించడం గర్వకారణంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. వేగంగా వస్తున్న కార్లను చూసి యువత ఓ కొత్త అనుభూతిని పొందారని చెప్పారు.
ఫార్ములా ఈ రేసింగ్ పై ప్రజల నుంచి భిన్న స్పందనలు వచ్చాయి. నగరంలో ప్రపంచ స్థాయి నిర్వహించడంపై కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా, మరి కొందరు మాత్రం ట్రాఫిక్ జామ్ పై మండిపడుతున్నారు. రేసు నేపథ్యంలో ఖైరతాబాద్, లక్డికపూల్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఈ క్రమంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ రేసింగ్ వల్ల ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు ఏర్పడ్డాయని చెప్పారు. పెద్ద మనసుతో నగరవాసులు క్షమించాలని ఆయన కోరారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చే క్రమంలో కొంత ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ బ్రాండ్ మార్మోగిపోతుందన్నారు.