కరోనా మరోసారి పడగ విప్పే ప్రమాదం వున్నట్టు తెలుస్తోంది. కేసులు తగ్గు ముఖం పట్టినట్టే కనిపించడం ఆ తర్వాత కొత్త వేరియంట్లు అలజడి సృష్టిస్తున్న విషయాన్ని మనం చూస్తూనే వస్తున్నాం. తాజాగా కరోనా పుట్టిల్లు చైనాలో కొత్త వేరియంట్ల్ బయటపడ్డాయి. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే సబ్ వేరియంట్లు ఒమిక్రాన్ బీఎఫ్.7,బీఏ.5.1.7 సబ్ వేరియంట్లు చైనాలోని పలు రాష్ట్రాల్లో వెలుగు చూశాయి.
ఈ రెండు వేరియంట్ల వల్ల వచ్చే శీతాకాలం నాటికి ప్రపంచ వ్యాప్తంగా కేసులు పెరిగే అవకాశాలు ఉన్నట్టు నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. ఈ రెండు సబ్ వేరియంట్లు అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని అంటున్నారు.
చైనాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఈ వేరియంట్లు వ్యాప్తి చెందాయన్ని పేర్కొంటున్నారు. ఓమిక్రాన్ బీఏ.5.1.7, బీఎఫ్.7 రూపాంతరాలు అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతాయని చెబుతున్నారు. గతంలో పొందిన రోగ నిరోధక శక్తిని కూడా ఇవి తట్టుకోగలవని చైనా ప్రభుత్వం వెల్లడించింది.
ఈ వేరియంట్ల ప్రభావంతో చైనాలోని షాంఘై సహా పలు పెద్ద నగరాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధించారు. స్కూల్స్, సినిమా హాళ్లు, పర్యాటక ప్రదేశాలను ఇప్పటికే మూసి వేసి, కరోనా టెస్టులను వేగవంతం చేస్తున్నారు. ఒమిక్రాన్ బీఎఫ్7 వేరియంట్ ఇప్పటికే కరోనా సోకిన వారికి సైతం మరోసారి సోకే అవకాశం ఉన్నట్టు ఆరోగ్య నిపుణులు ప్రకటించారు.
కొన్ని రోజులుగా యూఎస్ ఏలోనూ 13 శాతానికి పైగా ఈ వేరియంట్లు వ్యాపించాయి. పూర్తి స్థాయి టీకాలు తీసుకు వారికి సైతం బీఎఫ్.7 వేరియంట్ సోకుతుందని చెబుతున్నారు. కెంట్ వర్సిటీలోని మాలిక్యులర్ మెడిసిన్ ప్రొఫెసర్ మార్టిన్ మైఖెలిస్ మాట్లాడుతూ.. కరోనా వేరియంట్ బీఎఫ్.7 చాలా ప్రమాదకరమన్నారు. ఇది మరో వేవ్‌కు కూడా దారితీసే అవకాశం ఉందన్నారు. బ్రిటన్ ఆరోగ్య భద్రతా సంస్థ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది.
మరోవైపు ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ విషయంలో ప్రపంచ ఆరోగ్యం సంస్థ కూడా ఓ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ప్రపంచ దేశాలను డబ్ల్యూహెచ్ఓ అలర్ట్ చేసింది. ఈ కొత్త వేరియంట్ చాలా ప్రమాదకరమని హెచ్చరించింది. అందువల్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. శీతాకాలంలో ఈ కేసులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.