బంగారు తెలంగాణలో బాధలే తప్ప పేదల బతుకులు బాగు అవ్వడం లేదని ప్రతిపక్షాలు తిట్టి పోస్తూ ఉన్నాయి. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేశారని కనీసం బాధితులకు నష్ట పరిహారం కూడా అందడం లేదని విమర్శలు చేస్తున్నాయి. ఉద్యోగులకు జీతాలే సరిగ్గా ఇవ్వని పరిస్థితి ఉంటే.. ఇంక నష్టపరిహారం అందాల్సిన బాధితుల దుస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని అంటున్నాయి.
తాజాగా నారాయణపేట జిల్లాలో ఓ దంపతులు.. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పడుతున్న కష్టం వెలుగులోకి వచ్చింది. ధన్వాడ మండల పరిధిలోని మందిపల్లి పాతతండాకు చెందిన రవీందర్ నాయక్ కు గతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎంతగానో ప్రయత్నించాడు. కానీ.. ఎవరూ కనికరం చూపడం లేదు.
రెండేళ్లుగా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ప్రయత్నిస్తున్నానని.. కేసీఆర్ తమను ఆదుకోవాలని ఫ్లెక్సీతో నిరసన తెలిపాడు రవీందర్ నాయక్. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి విన్నవించినా.. నేటికీ ఎలాంటి ప్రయోజనం లేదని వాపోయాడు.
అనారోగ్యానికి గురై చికిత్స చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ఉపయోగపడుతుంది. రవీందర్ కూడా రోడ్డు ప్రమాదంతో ఆర్థికంగా చితికిపోయాడు. ఈక్రమంలోనే ఎమ్మెల్యేని కలిసి విన్నవించాడు. కానీ.. రెండేళ్లు దాటినా ఫలితం లేదు. ఎమ్మెల్యే స్పందించడం లేదు. అందుకే భార్యతో కలిసి నిరసన దీక్షకు దిగాడు.