నవ్ జీవన్ ఎక్స్ ప్రెస్ రైల్లో టీసీ పై ఓ వ్యక్తి దాడి చేశాడు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో మంగళవారం ఉదయం టీసీ కిరణ్ కుమార్ రైలు ఎస్ 1 కోచ్ లో తనిఖీలు చేస్తుండగా టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న రవితేజ అనే వ్యక్తి పట్టుబడ్డాడు.
ఈ క్రమంలో ఫైన్ కట్టాలని టీసీ కిరణ్ కుమార్ అతనికి చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన రవితేజ దాడి చేసి కిరణ్ కుమార్ పై పిడిగుద్దులు కురిపించాడు. దాడిలో కిరణ్ కుమార్ కు గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన జీఆర్పీ పోలీసులు రవితేజను అరెస్ట్ చేశారు. కిరణ్ కుమార్ ను ఆస్పత్రికి తరలించారు.
ఇక ఖమ్మం జీఆర్పీ ఎస్సై భాస్కర్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్లే నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులో ఇద్దరు యువకులు టికెట్ కలెక్టర్ ఎల్ కిరణ్ పై దాడికి పాల్పడ్డారు. కిరణ్ కుమార్ బల్లార్షా నుంచి విజయవాడ వరకు విధులు నిర్వహిస్తున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్లో మహబూబాబాద్ కు చెందిన గొల్లపల్లి రవితేజ, వరంగల్ కు చెందిన మోతిపట్ల సుమన్ టికెట్ లేకుండా ఎస్ 1 బోగీలో ప్రయాణిస్తున్నారు. వారిని టికెట్ అడిగినందుకు ఇద్దరు కలిసి టీసీ కిరణ్ కుమార్ పై దాడికి పాల్పడ్డారు.