కూతురు భారత అండర్ 17 మహిళల ఫుట్ బాల్ జట్టుకు కెప్టెన్ అయినా.. కూలీలుగానే మిగిలిపోయారు తల్లిదండ్రులు. పేద కుటుంబంలో పుట్టిన అష్టమ్ ఉరావ్ ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. తల్లిదండ్రులు కూలి పని చేస్తేనే తమ కడుపు నిండేది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏమాత్రం నిరాశ చెందకుండా తన ప్రతిభతో భారత అండర్ 17 మహిళల ఫుట్ బాల్ జట్టుకు కెప్టెన్ గా ఎంపికైంది అష్టమ్ ఉరావ్.
కానీ ఆమె విజయం సాధించినా.. అష్టమ్ తల్లిదండ్రులకు మాత్రం కూలీ కష్టాలు తప్ప లేదు. ఆమె విజయం వారి జీవితాలను ఏ మాత్రం మార్చలేకపోయింది. అష్టమ్ ఝార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో ఓ మారుమూల గ్రామానికి చెందిన యువతి. చిన్నప్పటి నుంచి కష్టపడి ఈ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ పోటీల్లో భారత జట్టుకు సారథ్యం వహిస్తున్న తమ కుమార్తె అష్టమ్ ఆటను కళ్లారా చూడాటానికైనా ఇంట్లో టీవీ లేదు.
మారుమూల ఉన్న వారి గ్రామానికి సరైన రోడ్డు కూడా లేదు. ఇటీవల మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఆమె కుటుంబానికి టీవీని కానుకగా ఇచ్చారు. అంతేకాకుండా ఇన్వర్టర్, కుర్చీలు కూడా అందజేశారు. అలాగే అష్టమ్ పేరు మీద ఆమె ఇంటి వరకూ అధికారులు రహదారిని నిర్మిస్తున్నారు.
అయితే ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏమిటంటే.. ఆ ఊర్లో వేసే రోడ్డు కోసం జరిగే నిర్మాణ పనుల్లో ఆమె తల్లిదండ్రులు కూలీలుగా పని చేస్తూ మట్టిని తవ్వి ఎత్తిపోస్తున్నారు. దీనిపై వారిని కదిలించగా పూట గడవాలంటే తాము పని చేయక తప్పదుగా అని ఆవేదన వ్యక్తం చేశారు.