పై చదువులు, ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్తున్న విద్యార్థులపై అక్కడి ప్రభుత్వం నిఘాపెట్టింది. బోగస్ ధ్రువపత్రాలతో వస్తున్నట్టు గుర్తించిన ప్రభుత్వం అలాంటి వారి సీట్లను రద్దు చెయనున్నట్టు పేర్కొంది. అమెరికన్ కాన్సులేట్ ఫిర్యాదుతో తెలుగు రాష్ట్రాలతో పాటు.. మరికొన్ని రాష్ట్రాల్లో కొందరు విద్యార్థులపై కేసులు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. ఇప్పుడది సంచలనంగా మారింది.
తాజాగా అమెరికా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఆ దేశంలో ఎఫ్-1 వీసాపై ప్రస్తుతం 2.32 లక్షల మంది భారత విద్యార్థులు చదువుతున్నట్టు తెలుస్తోంది. అక్కడికి వెళ్లే విద్యార్థుల్లో ఎక్కువ మంది నాణ్యమైన చదువు కంటే.. హెచ్1-బి వీసా ద్వారా అక్కడ స్థిరపడాలన్న లక్ష్యంతోనే వెళ్తున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐఐటీ పట్టభద్రుడి కన్నా అమెరికా వెళ్లిన సాధారణ విద్యార్థి మెరుగ్గా సంపాదిస్తున్నాడన్న భావన ఇక్కడి యువతలో ఉందని పేర్కొంటున్నారు.
ఆ కారణాలతోనే ఇటీవల మధ్య, దిగువ మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు సైతం అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్తున్నారు. అయితే.. కొందరు మాత్రం అక్రమ మార్గాలను వెతుక్కుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. నిపుణులతో జీఆర్‌ఈ రాయించి మంచి స్కోర్ పొందటం.. బ్యాంకు ఖాతాలో విదేశీ చదువుకు అవసరమైన డబ్బు ఉన్నట్లు చూపడం.. గతంలోనే బీటెక్ పూర్తయినవారు అప్పటి నుంచి ఉద్యోగం లేకున్నా ఉన్నట్లు చూపటం వంటి అక్రమాలకు పాల్పడుతున్నట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
చిన్న కంపెనీల నుంచి అనుభవ ధ్రువపత్రాలు సమర్పించడం తదితరాలను అవలంబిస్తున్నట్టు వస్తున్న ఆరోపణలను కొట్టి పారేయలేమని చెప్తున్నారు. అయితే.. ఇలాంటి చర్యలను అడ్డుకునేందుకు అమెరికా ప్రభుత్వం నిఘా పెంచి.. అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వారిపై కేసులు పెట్టేందుకు సిద్ధమైందని హైదరాబాద్ కు చెందిన ఓ విదేశీ కన్సల్సెన్టీ నిర్వాహకుడు తెలిపారు. కొన్ని ప్రముఖ కన్సల్టెన్సీలే తమ ఫీజు కోసం విద్యార్థులను అలా ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.