తమ వర్గానికి ఎన్నికల చిహ్నంకేటాయింపు పై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తోందని మహారాష్ట్ర మాజీ సీఎం ఉధ్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం తీవ్ర అసంతృప్తిని ప్రకటించింది. పైగా విల్లంబులు గుర్తును ఎన్నికల కమిషన్ స్తంభింపజేసిందని, దీన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టుకెక్కాలని యోచిస్తోంది. ఈ విషయంలో శివసేన కు చెందిన రెండు వర్గాలకూ ఈసీ దాదాపు షాకిచ్చింది.
ఓ వైపు అంధేరీ ఈస్ట్ ఉప ఎన్నిక వస్తుండగా తమకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారమూ తెలియజేయలేదని ఉధ్ధవ్ శిబిరం ఆరోపిస్తోంది. మేము ఏ చిహ్నాన్ని, పేరును నిర్ణయించుకోవాలో అన్న దానిపై ఓ నిర్ధారణకువచ్చేందుకు ఈసీ తగినంత సమయం ఇవ్వలేదని, దీనిపై కోర్టుకెక్కే యోచనలో ఉన్నామని ఈ శిబిరంలోని రాజ్యసభ ఎంపీ అనిల్ దేశాయ్ తెలిపారు.
త్రిశూలం, ఉదయిస్తున్న సూర్యుడు, వెలుగుతున్న టార్చి చిహ్నాల్లో ఒకదానిని తమకు కేటాయించాలని ఎన్నికల సంఘాన్ని కోరామని ఆయన చెప్పారు.
సోమవారం లోగా పేర్లకు సంబంధించి మూడు చాయిస్ లను, ఫ్రీ సింబల్స్ లో మీరు ఎంపిక చేసిన వాటిని సూచించాల్సిందిగా ఈసీ.. ఉద్ధవ్ క్యాంప్ ని, సీఎం ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని సేన వర్గాన్ని కోరింది.అయితే ఈసీ వైఖరి సమంజసంగా లేదని థాక్రే అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కమిషన్ నిర్ణయం తమకు షాకిచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. నా పార్టీకి సాధ్యమైనంత త్వరగా చిహ్నాన్ని, పేరును ఖరారు చేయాలని ఆయన కోరారు. అంధేరీ ఈస్ట్ బై పోల్ ని ఈ రెండు వర్గాలూ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో దివంగత శివసేన ఎమ్మెల్యే రమేష్ లట్కె భార్య రుజుతకి, బీజేపీ నేత ముర్జీ పటేల్ కి మధ్య నేరుగా పోటీ ఉంది.