మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే చూపిన మార్గం నుండి ఉద్దవ్ ఠాక్రే తప్పుకున్నారని ఆమె అన్నారు.
ప్రస్తుతం ఉద్దవ్ 10 జన్ పథ్ లో నివసిస్తున్న మాతోశ్రీ (సోనియాగాంధీ) ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు. ముంబై ర్యాలీలో రైతుల సమస్యలు, నిరుద్యోగం లాంటి అంశాలను ప్రస్తావించకపోవడంపై ఠాక్రేను ఆమె తప్పుబట్టారు.
ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్‌గా మారుస్తామని గతంలో శివసేన ప్రకటించిందన్నారు. కానీ ఇప్పుడు ఆ మార్పు అవసరం లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారని రాణా దంపతులు ఆరోపించారు. ఒక వేళ ఆ వాగ్దానాన్ని అమలు చేస్తే మద్దతు ఉపసంహరించుకుంటామని మిత్ర పక్షాలు శివసేనను హెచ్చరించాయన్నారు.
దీంతో మహావికాస్ అఘాడీ ప్రభుత్వం పడిపోతుందని ఠాక్రే ఆందోళన చెందుతున్నారని ఆమె చెప్పారు. ఒక వేళ కాంగ్రెస్ తో చేతులు కలపాల్సి వస్తే శివసేనను రద్దు చేస్తామని గతంలో బాల్ ఠాక్రే ప్రకటించారని ఆమె పేర్కొన్నారు. కానీ బాల్ ఠాక్రే ఆదర్శా్లను ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే విస్మరించారని వివరించారు.