మోడీ సర్కార్ ను వెంటాడతానని సవాల్ చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రతిపక్ష నేతలను ఒక దగ్గరకు చేర్చేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే బెంగాల్ సీఎం మమత, జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడతో ఫోన్ లో మాట్లాడిన ఆయనకు.. మహారాష్ట్ర సీఎం థాక్రే టచ్ లోకి వచ్చారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన ఖరారైంది.
ఈనెల 20న ఉద్ధవ్ థాక్రేతో కేసీఆర్ భేటీ కానున్నారు. బుధవారం ఉదయం కేసీఆర్ కు థాక్రే ఫోన్ చేసి మాట్లాడారు. ఆయన ఆహ్వానం మేరకు 20న సీఎం ముంబైకి బయలుదేరి వెళ్లనున్నారు.
కేంద్రంపై గొప్పగా పోరాడుతున్నారని కేసీఆర్ ను పొగిడారు థాక్రే. దేశాన్ని విభజన శక్తుల నుండి కాపాడుకోవడానికి సరైన సమయంలో గళం విప్పారని.. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు పోరాటం కొనసాగిద్దామని చెప్పారట. దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని థాక్రే చెప్పినట్లు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ఫెడరల్ న్యాయం కోసం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి ఉద్ధవ్ సంపూర్ణ మద్దతును పలికారు. ఇదే సందర్భంలో ముంబైకి రావాలని ఆహ్వానించారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుందామని తెలిపారు. దీంతో 20న ముంబై వెళ్తున్నారు కేసీఆర్.