శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చేందుకు ఆ పార్టీ నేతలు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అనుసరిస్తున్నారు. తాజాగా రెబెల్స్ ను వెనక్కి రప్పించేందుకు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే తన భార్య రష్మీ ఠాక్రేను కూడా రంగంలోకి దించారు.
రెబెల్స్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను సీఎం సతీమణి కలుస్తున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల భార్యలతో ఆమె చర్చలు జరుపుతున్నారు. పార్టీలోకి తిరిగి వస్తేనే ఇటు పార్టీకి, అటు వారికి రాజకీయ భవిష్యత్ ఉంటుందని, అందువల్ల మీ భర్తలను వెనక్కి పిలిపించి వారికి సర్ది చెప్పండంటూ ఎమ్మెల్యేల భార్యలను ఒప్పించే ప్రయత్నం ఆమె చేస్తున్నారు. ఈ స్ట్రాటజీ ఎంత వరకు పనిచేస్తుందో చూడాలి మరి.
ఇక అనర్హత వేటుకు మరో రోజు మాత్రమే మిగిలి ఉండటంతో రెబెల్ ఎమ్మెల్యేలు ఎలాంటి అడుగులు వేయబోతున్నారో అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే గుజరాత్ లో వారు బీజేపీ నేతలను కలిసినట్టు సమాచారం. అదే సమయంలో గుజరాత్ లో కేంద్రం హోం మంత్రి అమిత్ షా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో సీన్ లోకి అమిత్ షా ఎంటర్ అయినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు బీజేపీలో చేరడానికి కొందరు రెబెల్ ఎమ్మెల్యేలు ససేమేరా అంటున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వారిలో కొందరు సీఎం ఉద్దవ్ ఠాక్రేక్ కు టచ్ లోకి వచ్చినట్టు సమాచారం. దీంతో షిండే ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో… పరిణామాలు ఎలా మారతాయోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.