మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని సేన వర్గమే అసలైన శివసేన అని .. ఆ పార్టీకే ఎన్నికల చిహ్నంగా విల్లంబులను కేటాయిస్తున్నామని ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకెక్కాలని మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే వర్గం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ఉద్ధవ్ శిబిరం తెలిపింది. ఈసీ ఉత్తర్వులపై స్టే విధించాలని కోరనున్నట్టు పేర్కొంది.
ఈసీ నిర్ణయంలో ఎన్నో పొరబాట్లు ఉన్నాయని తప్పు పట్టిన ఈ వర్గాలు.. షిండే ఆధ్వర్యం లోని పార్టీ నియమావళికి సవరణలు ప్రజాస్వామ్య విరుద్ధమని చెప్పడం తప్పని ఆరోపించాయి. 2022 జులైలో షిండే మీటింగ్ విషయంలో ఇదే నియమావళిపై ఈసీ మరోరకంగా వ్యవహరించిందని ఆరోపించాయి.
ఇలాగే ఎన్నికల కమిషన్ పలు పొరబాట్లు చేసిందని, అన్నింటినీ తమ పిటిషన్ లో వివరిస్తామని ఉద్ధవ్ థాక్రే వర్గం వివరించింది. అయితే షిండే శిబిరం కూడా .. ఈ విషయంలో కోర్టు ఏదైనా తీర్పు చెప్పడానికి ముందే సిద్ధమై కెవియట్ పిటిషన్ దాఖలు చేసింది.
తమ పార్టీ విల్లంబుల చిహ్నాన్ని ‘దొంగిలించిన దొంగ’ కు గుణపాఠం చెప్పాలని ఉధ్దవ్ థాక్రే నిన్న తన మాతోశ్రీ నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న తమ సేన వర్గం కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కూడా సూచించారు. అయితే ఈసీ నిర్ణయంపై చర్చ అనవసరమని, కొత్త చిహ్నం పైనే దృష్టి పెట్టాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ .. ఉద్ధవ్ థాక్రేని కలిసి బుజ్జగించారు. కానీ థాక్రే పట్టించుకున్నట్టు కనబడలేదు.