ప్రపంచంలోకెల్లా భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని కొనియాడారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. హైదరాబాద్ ముచ్చింతల్ లోని స్వర్ణభారత్ ట్రస్ట్ లో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కాలాన్ని గౌరవించి.. ప్రకృతిని రక్షించుకోవడమే ఉగాది సందేశమని చెప్పారు.
భిన్నత్వంలో ఏకత్వం చాటే సంస్కృతికి ఉగాది ప్రతీక అని చెప్పారు. ఉగాది పచ్చడి ఇచ్చే సందేశమే వ్యక్తిత్వ వికాసం పాఠమని తెలిపారు. మనవైన వేషభాషలు, ఆచార వ్యవహారాలను కాపాడుకోవాలని సూచించారు. మన ఉనికిని కాపాడుకునేందుకు నిత్యం ప్రయత్నించాలని సూచించారు.
తెలుగు భాష అమ్మ వంటిదని..అమ్మభాష రాకుంటే అంతకు మించిన దరిద్రం మరొకటి లేదని వ్యాఖ్యానించారు వెంకయ్య. ఇంట్లో, వీధిలో, బడిలో, గుడిలో ఎక్కడికి వెళ్లినా.. తెలుగులోనే మాట్లాడాలని కోరారు. తెలుగు భాషను కాపాడాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. సంప్రదాయ దుస్తులు, ఆహారం పెద్దలు మనకిచ్చిన ఆస్తి అని చెప్పారు.
భారత్ ఎదుగుదల చూసి పాశ్చాత్య దేశాలకు అసూయ పుడుతోందని పేర్కొన్నారు వెంకయ్య. మన ప్రగతిని అడ్డుకునేందుకు అనేక కుయుక్తులు పన్నుతున్నాయని వివరించారు. దేశ ప్రతిష్ఠకు భంగకరమైన వార్తలపై అప్రమత్తత అవసరమని సూచించారు. సాంఘిక వివక్ష పాటించబోమని అందరూ ప్రతిజ్ఞ చేయాలన్నారు వెంకయ్యనాయుడు.