గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వేద పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు. రాష్ట్రం, దేశంలో రాజకీయంగా పలు మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దూరం పెరుగుతుంది. ఈ ఏడాది సైకిల్ దూసుకెళ్తుందన్నారు.
ప్రజల్లో నారా లోకేష్ కు మంచి గుర్తింపు వస్తుందని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షానికి ఆదరణ ఎక్కువగా ఉంటుందన్నారు. అలాగే ప్రతిపక్షాలన్నీ ఏకమవుతాయన్నారు. టీడీపీకి ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుందని పేర్కొన్నారు. అదే సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చంద్రబాబుకు వేద పండితులు సూచించారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పంచాంగం ఓ డెరెక్షన్ ఇస్తుంది.. సూచన ప్రాయంగా సంకేతాలిస్తుంది.. పంచాంగం ఎంతో శాస్త్రోక్తంగా రాస్తున్నారని.. అస్ట్రాలజీ కూడా సైన్సేనని తెలిపారు చంద్రబాబు. ప్రజలు జాగ్రత్త పడడానికి పంచాంగం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు చంద్రబాబు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు పట్టం కట్టారన్నారు. పదవుల్లో శాశ్వతంగా ఉండటానికి ఇది రాచరికం కాదని, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజాస్వామ్యం కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కష్టాలే ఉన్నాయని, శోభకృత్ నామ సంవత్సరంలో శుభాలే జరుగుతాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు వెలుగు రావడం ఖాయమన్నారు. అరాచకానికి కూడా ఓ పద్దతి, ఓ విధానం ఉంటుందని మండిపడ్డారు. గత 40 ఏళ్లల్లో ఎప్పుడూ చూడని అరాచకాలు చూశానని.. ప్రశ్నించిన పేదలపై దాడులు జరిగాయని అన్నారు. అధికార పార్టీ ఆశలు ఇక సాగవని పంచాంగంలో కూడా చెప్పారన్నారు చంద్రబాబు. మహిళలకు రక్షణ ఉండాలని, ప్రజలపై భారం పడిందని చెప్పారు. ధరల పెరుగుదలపై రాజీ లేని పోరాటం చేస్తామన్నారు పేర్కొన్నారు చంద్రబాబు.