లోకల్ ట్రైన్ లో సీటు కోసం ముగ్గురు మహిళలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. ఒకరికొకరు తన్నుకున్నారు. చివరికి అరెస్ట్ వరకూ వెళ్లిందంటూ ఊహించుకోండి. సీటు విషయంలో మహిళల మధ్య వివాదం ముదరడంతో బాహాబాహీకి దిగిన ఘటన ముంబై లోకల్ ట్రైన్‌లో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీట్ల కోసం కొట్టుకున్న మహిళల్లో విద్యావంతులు కూడా ఉండడం అందరిని షాక్‌కు గురిచేసింది. చిన్న విషయంపై వాళ్లు పరిస్థితిని చేజారేదాకా తీసుకొచ్చారు. ఈ ఘర్షణలో తోటి ప్రయాణికులకు కూడా గాయాలయ్యాయి.
Fight between two female passengers over a seat in #Local #TRAIN .
The woman police constable who went to the rescue got hurt.
Both women filed a case against each other at Vashi Railway Police Station.@Central_Railway #Mumbai pic.twitter.com/nFOKv7bOWv
— Siraj Noorani (@sirajnoorani) October 6, 2022
వివరాల్లోకి వెళ్తే.. తలోజా నివాసి గుల్నాథ్ జుబారే ఖాన్, ఆమె కుమార్తె అంజు ఖాన్, ఆమె పదేళ్ల మనవరాలు రాత్రి 7.30 గంటల సమయంలో థానేలో రైలు ఎక్కారు. కోపర్ ఖైరానే వద్ద రైలు ఎక్కిన స్నేహా దేవే తుర్భే స్టేషన్‌లో ఖాళీగా ఉన్న సీటులో కూర్చుంది. ఇదే సమయంలో పదేళ్ల చిన్నారిని కూర్చోనివ్వకుండా సీటు లాక్కున్నారని ఆరోపిస్తూ జుబారే ఖాన్, అంజుఖాన్ స్నేహదేవేతో వాగ్వాదానికి దిగారు. మొదట మాటలతో మొదలైన ఈ గొడవ చిలికి చిలికి గాలి వానగా మారిపోయింది. తగ్గేదేలే అన్నట్లు ముగ్గురు జుట్లు పట్టుకుని కొట్టుకునే దాకా వచ్చింది.
ఈ లోపు ఘర్షణ పడుతున్న మహిళలను వారించేందుకు అక్కడికి మహిళా కానిస్టేబుల్ శారద ఉగ్లే వచ్చింది. వారి గొడవను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో కొద్దిసేపు ఆ ముగ్గురు మహిళలు నిశ్శబ్ధంగా ఉండిపోయారు. అయితే ఏమైందో తెలియదు కానీ మళ్లీ ముగ్గురు గొడవకు దిగారు. ఈ క్రమంలో తోటి ప్రయాణికులకు, లేడీ కానిస్టేబుల్ కి కూడా గాయాలవ్వగా, ఆస్పత్రికి తరలించారు.
సీటు విషయంలో మహిళల మధ్య జరిగిన ఘర్షణలో మహిళా సిబ్బందికి గాయాలయ్యాయని వషి రైల్వే స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎస్ కటారె వెల్లడించారు. కాగా తల్లీకూతుళ్లిద్దరిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు. అదేవిధంగా అంజుఖాన్‌ను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఇదెక్కడి గొడవరా బాబు అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.