మీరు ఆధార్ కార్డు తీసుకొని పదేళ్లు దాటిందా? అప్పటి నుంచి ఒక్కసారి కూడా మీ పర్సనల్ డీటైల్స్ ని అప్డేట్ చేసుకోలేదా? అయితే వెంటనే మీరు ఒక పని చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు పూర్తయితే కనుక.. వీలైనంత త్వరగా మీ అడ్రస్, ఐడెంటిటీ ప్రూఫ్ ని జత చేసి మళ్లీ అప్ డేట్ చేయించుకోవల్సి ఉంటుంది.
అదేంటని షాక్ అవుతున్నారా? మీరు ఆధార్ కార్డును తీసుకుని 10 సంవత్సరాలు పూర్తయితే ఒక్కసారి అప్ డేట్ చేయించుకోవాలని ఆధార్ కార్డుల జారీ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) సూచనలు జారీ చేసింది. ఇందుకు గాను ఆధార్ ఆన్‌లైన్ పోర్టల్‌లో ‘అప్‌డేట్ డాక్యుమెంట్’ పేరుతో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. అయితే.. ఐడెంటిటీ, రెసిడెన్స్ ప్రూఫ్ డాక్యుమెంట్లను మళ్లీ సమర్పించడం తప్పనిసరి కాదని యూఐడీఏఐ స్పష్టం చేసింది.
ఆయా ప్రభుత్వాలు ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నా.. లబ్ధిదారుల ఎంపికకు ఆధార్‌ను కూడా ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. మరోవైపు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోకపోతే లావాదేవీలను నిలిపివేసే అవకాశం ఉందంటూ వివిధ బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల క్రితం నాటి మన ఫొటోతో పాటు ప్రస్తుత చిరునామా.. ఆధార్‌లోని చిరునామా సరిపోలక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ పేర్కొంది.
‘మై ఆధార్’ పోర్టల్ ద్వారా అయినా లేదా దగ్గర్లోని ఆధార్ కేంద్రం నుంచి అయినా మీ ఆధార్ కార్డును అప్ డేట్ చేయించుకోవాలని అని ఓ ప్రకటనలో పేర్కొంది యూఐడీఏఐ. దేశంలోని పౌరులందరికీ విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తూ ఆధార్ కార్డులు జారీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఐరిస్, వేలిముద్రలు, ఫొటోలను ఇందుకు ప్రామాణికంగా తీసుకుంటుంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక సహా వేర్వేరు అవసరాలను ఆధార్ ను ఉపయోగిస్తోంది కేంద్రం.