నువ్వు నీ శరీరం నుంచి తగ్గించే ప్రతి కిలోకు రూ.1000 కోట్లు చొప్పున నీ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తాను అంటూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఓ ఎంపీతో అన్నారు. అంతే ఆ ఎంపీ ఎలాగైనా తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకుని రావాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఆ ధ్యేయంగా ఆయన బరువు తగ్గడం ప్రారంభించారు. ఇంతకు ఎవరా మంత్రి.. ఏమిటా కథ..?
వివరాల్లోకి వెళ్తే.. ఫిబ్రవరిలో నితిన్ గడ్కరీ ఉజ్జయినీని సందర్శించినప్పుడు ఎంపీ అనిల్ ఫిరోజియాను కలిశారు. అప్పుడు ఆయన బరువు 127 కేజీలు. ఆ బరువును ఎలాగైనా తగ్గించాలన్న ఉద్దేశంతో ‘మీరు కనుక మీ బరువు తగ్గించుకుంటే నేను మీ నియోజకవర్గ అభివృధ్దికి నిధులిస్తాను. అది కూడా ఎలా అంటే మీరు తగ్గే ప్రతి కిలోకు రూ.1000 కోట్ల చొప్పున ఇస్తాను’ అని నితిన్ అన్నారు.
ఎలాగైనా సరే.. తన నియోజక వర్గానికి నిధులు సంపాదించాలన్న ఉద్దేశంతో కేవలం నాలుగు నెలల్లో 15 కిలోల బరువు తగ్గారు అనిల్. ఇందుకు గాను గడ్కరీనే తనకు స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. ఒకానొక సందర్భంలో నితిన్ కూడా దాదాపు 135 కిలోలు ఉండేవారని, ఇప్పుడు ఆయన 93 కిలోలు ఉన్నారని చెప్పినట్లు అనిల్ వివరించారు. బరువు తగ్గేందుకు ఎటువంటి ఆహారం తీసుకోవాలి.. ఎటువంటి వ్యాయామం చేయాలి అనే అంశాలను స్వయంగా గడ్కరీ తనకు వివరించినట్లు తెలిపారు.
ఇప్పుడు తాను 15 కిలోల బరువు తగ్గానని… అంటే నియోజకవర్గానికి రూ.15,000 కోట్ల నిధులను సంపాదించాను అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ. వర్షాకాల సమావేశాలప్పుడు నితిన్ ను కలుస్తానని.. బరువు తగ్గిన విషయం ఆయనకు తెలియజేసి నిధులను పొందుతానని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి ఎంపీ తన ఆరోగ్యం కోసం బరువు తగ్గారు.. నియోజకవర్గం కోసం డబ్బులు సంపాదించగలిగారు అంటూ నెటిజన్లు ఆయనను పొగిడేస్తున్నారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.