మహిళల కోలాటాలు.. పోతురాజు విన్యాసాలు.. పోటెత్తుతున్న భక్తులు.. ప్రముఖుల సందర్శనలు.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ వైభవంగా కొనసాగుతోంది. తల్లి బయిలెల్లినాదో.. నాయనో.. అమ్మా బయిలెల్లినాదో అంటూ ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం ఉదయం అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. కుటుంబ సమేతంగా తొలిపూజ నిర్వహించారు. అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు.
Advertisements
రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా బోనాల జాతర నిర్వహిస్తున్నారు. బోనమెత్తే మహిళలు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల నృత్యాలతో బోనాల జాతర కన్నుల పండుగగా సాగుతోంది. సోమవారం రంగం కార్యక్రమం ఉంటుంది. ఇటు ఆలయాన్ని రాజకీయ, సినీ ప్రముఖులు సందర్శించారు. అమ్మవారిని బోనం సమర్పించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత సహా పలువురు ప్రముఖులు మొక్కులు చెల్లించుకున్నారు.
ప్రస్తుతం ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై దయ చూపాలని అమ్మవారిని కోరుకున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సమస్త హిందూ సమాజానికి ఆయన బోనాల శుభాకాంక్షలు చెప్పారు. ఈరోజు ఉదయం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు.
కుటుంబ సభ్యులతో ఆలయానికి వచ్చిన ఆయన అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. గొల్కోండలో బోనాలు ప్రారంభమయ్యాయని, అనేక సంవత్సరాలుగా బోనాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందన్నారు. దేశంలో ఈ రకమైన పండుగ ఎక్కడా కనిపించదని తెలిపారు.
ధనిక, పేద అనే తేడా లేకుండా ఈ బోనాలు నిర్వహిస్తున్నారని కిషన్ రెడ్డి వెల్లడించారు. అంటు వ్యాధులు రాకుండా ప్రజలు ఇబ్బందులు పడకుండా, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. భవిష్యత్ లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించకూడా ఉండాలని, కరోనా పూర్తిగా నయం కావాలని.. మానవత సమాజం విజయం సాధించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
బోనాల సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ నిర్వాహకులు కృషి చేస్తున్నారని కిషన్ రెడ్డి సతీమణి తెలిపారు. ఇవాళ ఉదయం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉజ్జయినీ మహంకాళి బోనాలు ప్రారంభమయ్యాయి. భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు.