లండన్ లో భారత హైకమిషన్ కార్యాలయం పై గల భారత జాతీయ పతాకాన్ని దించివేసి.. తమ జెండాను ఎగురవేయడానికి ఖలిస్తానీలు ఇటీవల చేసిన ప్రయత్నాన్ని అధికారులు విఫలం చేశారు. అక్కడే భారీ భారతీయ జెండా ఎగురవేశారు. ఖలిస్థానీల దాడి అనంతరం ఈ కార్యాలయ భవనం వద్దకు నిన్న పెద్ద సంఖ్యలో చేరుకున్న ప్రవాస భారతీయులు ఇండియాకు అనుకూల నినాదాలు చేస్తూ భారీ ప్రదర్శనకు పూనుకొన్నారు. వీరికి సంఘీభావంగా నిక్ అనే బ్రిటన్ పోలీసు అధికారి కూడా అక్కడికి చేరి.. ఓ బాలీవుడ్ సాంగ్ కి డ్యాన్స్ చేశాడు. ఇక్కడ అంతా సంతోషంతో ఈ ప్రదర్శన చేస్తున్నారని, వీరితో నేను మాత్రం ఎందుకు కలవకూడదని నిర్ణయించుకుని ఈ సాలిడారిటీ షో లో పాల్గొంటున్నానని ఆయన చెప్పాడు.
ఇది కమ్యూనిటీ ఎంగేజ్మెంట్.. అంతా కలిసి జరుపుకుంటున్న వేడుక వంటిది అని ఆయన వ్యాఖ్యానించాడు. పైగా ‘థ్యాంక్యూ ఇండియా’ అంటూ ఇండియా పట్ల తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ షో లో కొంతమంది స్వచ్చంద సంస్థల తరఫున రాగా.. చాలామంది తమకు తాము వ్యక్తిగతంగా హాజరయ్యారు. మరికొందరు తమ చెంపలపై భారత త్రివర్ణ పతాకాన్ని ప్రతిబింబించే మూడు రంగులను అద్దుకుని వచ్చారు.
మేమంతా ఎక్కడ ఉన్నా ఎవరెవరు ఏ దేశానికి చెందినా.. ఇలాంటి దాడులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటామని, మా స్ట్రెంత్ ని, ఇండియా పట్ల మా అభిమానాన్ని చాటుకోవడానికి ఏ మాత్రం వెనుకంజ వేయబోమని బ్రిటన్ లో భారతీయ మహిళల ప్రయోజనాలను పరిరక్షించే ఓ సంస్థకు చెందిన సారికా హండా అనే సభ్యురాలు చెప్పారు.
ఇక్రా ఖాన్ అనే మరో మహిళ.. తాను 10 దేశాల్లో నివసించి ట్రావెల్ చేస్తూ వచ్చానని.. కానీ ఇండియా మూలాలే తనకు ప్రధానమని తెలిపారు. ఈ ప్రదర్శన సందర్భంగా కొందరు ఇండియన్ హైకమిషన్ భవన బాల్కనీ వద్దకు చేరుకొని భారతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతం పాడారు. మీరు (ఖలిస్తానీలు) ఓ జెండాను కిందికి దింపేశారు. కానీ మేము వందలాది జెండాలతో వచ్చాం అని కశ్యప్ పాండ్య అనే వ్యక్తి చెప్పారు.