భారతదేశంలో కరోనాను నిరోధించడానికి కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు రెండు డోసులుగా ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక దేశం ప్రయాణికులు ఇతర దేశాలకు వెళ్తున్నప్పుడు వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరి. అయితే భారతీయులకు మాత్రం ఈ విషయంలో చేదు అనుభవం ఎదురైంది. వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ కొన్ని దేశాలు మనవాళ్లను అనుమతించలేదు. కొన్ని దేశాల్లో అయితే క్వారంటైన్ లో ఉంచారు.
కోవిషీల్డ్ వేసుకున్న భారతీయులను టీకా వేయించుకొని వారి కిందే లెక్కేసి, 14 రోజులపాటు క్వారంటైన్ లో ఉంచుతున్నాయి యునైటెడ్ కింగ్డమ్ తో పాటు కొన్ని దేశాలు. ఈ విషయంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం తమ దేశానికి వచ్చే ప్రయాణికులకు, ముఖ్యంగా భారతీయులకు విధిస్తున్న నిబంధనలలో కొన్ని చేంజెస్ చేయాలని నిర్ణయించుకుంది.
యూకె ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన లో కోవిషీల్డ్ ను కూడా లెక్కలోకి తీసుకుంటున్నామని, ఆ టీకా కూడా కరోనా టీకాగా పరిగణించడానికి అర్హత సాధించినట్లు పేర్కొంది. యూకే నుండి విడుదలైన ప్రకటనలో వంటి “అస్ట్రాజెనెకా, కోవిషీల్డ్, ఆస్ట్రాజెనెకా వాక్సేవ్రియా మరియు మోడెర్నా టకేడా వంటి నాలుగు లిస్టెడ్ వ్యాక్సిన్‌ల ఫార్ములేషన్‌లు తాజాగా కరోనా టీకాల జాబితాలో అర్హత పొందినట్టు వెల్లడించింది. ఇంకా ఆ అధికారిక నోటీసులో ఇంగ్లాండ్ రావడానికి కనీసం 14 రోజుల ముందు అడ్మినిస్ట్రేషన్ పేర్కొన్న వ్యాక్సిన్ డోసులు పూర్తి చేసుకోవాలని పేర్కొంది. ఇంగ్లాండ్ వెళ్లే భాతీయులకు ఇది నిజంగా ఊరటనిచ్చే విషయం.