మన దగ్గర వరుణుడు వణికిస్తుంటే.. బ్రిటన్ లో భానుడు భగభగమంటున్నాడు. అక్కడ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా సౌత్ లండన్ లో ఉష్ణోగ్రతలు అధికంగా రికార్డ్ అవుతున్నాయి. యూకేలో ఇప్పటివరకూ నమోదైన అత్యంత అధిక ఉష్ణోగ్రతలు ఇవేనని అక్కడి వాతావరణశాఖ పేర్కొంది. ఈ వారంలో 41 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని తెలిపింది.
చరిత్రలో ఎన్నడూ చూడని అధిక ఉష్ణోగ్రతలతో ఓవైపు అల్లాడుతుంటే.. ఇంకోవైపు అగ్నిప్రమాదాలు భయపెడుతున్నాయి. తూర్పు లండన్ లో భారీగా మంటలు వ్యాపించడంతో అనేక ఇళ్లు కాలిపోయాయి. నాటింగ్ హామ్ లోని ఒక పొలంలో ముందుగా మంటలు చెలరేగాయి. అవి.. మెల్లమెల్లగా వ్యాపిస్తూ ఇళ్లకు అంటుకున్నాయి. లండన్ అగ్నిమాపక దళం మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా కష్టపడింది.
ఈ ఘటనే కాదు ఇంకా చాలా ప్రాంతాలలో అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రెయిన్ హామ్ సమీపంలోని వెన్నింగ్ టన్ లో మంటలు ఎగిసి పడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇళ్లను కాల్చి బూడిద చేస్తూ మంటలు వ్యాపిస్తున్నాయి.
అధిక ఉష్ణోగ్రతల కారణంగా జనం అల్లాడుతున్నారు. ఇప్పుడు అగ్నిప్రమాదాలు కూడా జరుగుతుండడంతో అత్యధిక వేడి కారణంగా ప్రజలతోపాటు వన్యప్రాణాలు అల్లాడుతున్నాయి.