బ్రిటన్‌లో ఓటర్ల అభిప్రాయాలు రోజురోజుకి మారుతున్నట్లు తెలుస్తోంది. నిన్నటి వరకు ముందజలో ఉన్న రిషి సునాక్ ఎందుకో ఒక్కసారిగా వెనుకబడినట్లు అనిపిస్తోంది. ఇప్పటికే ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్న రిషి సునాక్, లిజ్ ట్రస్‌లు పార్టీ ఓటర్ల మద్ధతు కోసం గట్టిగానే కృషి చేస్తున్నారు.
వచ్చే వారంం నుంచి పార్టీకి చెందిన బ్యాలెట్ పత్రాలు పంపనున్న నేపథ్యంలో కన్జర్వేటివ్ ప్రచారం కార్యాలయం ఉత్తర ఇంగ్లాండ్ లోని లీడ్స్ నగరంలో ఓటర్లతో సునాక్, ట్రస్‌లు ముఖాముఖిని నిర్వహించారు. కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలతో పాటు సభ్యుల మద్దతును పొందిన వారే దేశ ప్రధాని అవుతారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఓటర్లు సునాక్, ట్రస్ ల విధానాల గురించి రకరకాల ప్రశ్నలు సంధించారు.
కాగా పార్టీలో ఇప్పటికే కొందరు బోరిస్ జాన్సన్ పట్ల మక్కువ చూపుతున్నట్లు దీని ద్వారా తెలుస్తోంది.
“ఆర్థిక మంత్రి పదవికి ఉన్న ఫళానా రాజీనామా చేయడం ద్వారా మీ నాయకుడు జాన్సన్‌కు వెన్నుపోటు పొడిచారని కొందరు అభిప్రాయపడుతున్నారు” అని ఓ ఓటరు సునాక్‌ను ఉద్దేశించి అడిగారు.
దీన్ని ఖండిస్తూ సునాక్ సమాధానమిచ్చారు. ఆర్థిక విధానాలపై తమ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడం వల్లనే తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని వివరించారు. అలాగే “ఆర్థిక మందగమనం, పెరిగిన జీవనవ్యయం ఇబ్బంది పెడుతున్నాయి. వీటిని ఎలా పరిష్కరిస్తారు?” అని అభ్యర్థులిద్దరినీ కొందరు ప్రశ్నించారు. ఈతరం సుఖంగా జీవించడానికని పన్నులను భారీగా తగ్గించి భావితరాల భవిష్యత్తును తాకట్టుపెట్టలేనని సునాక్ ప్రకటించారు.
ట్రస్ మాత్రం ప్రధానమంత్రి పదవి స్వీకరించిన వెంటనే పన్నులను భారీగా తగ్గించేస్తానని వాగ్దానం చేశారు. వచ్చే సోమవారం నాడు అభ్యర్థులిద్దరూ నైరుతి ఇంగ్లాండ్ లోని ఎక్సెటర్‌లో పార్టీ ఓటర్ల ముందుకెళతారు. ప్రస్తుత పరిస్థితుల్లో సునాక్‌కు ఎంపీల మద్దతు ఉన్నా పార్టీ ఓటర్లలో ఆయన ప్రత్యర్థి లిజ్ ట్రస్ వైపు కొంత మొగ్గు ఉన్నట్లు తెలుస్తోంది.