బ్రిటన్ ప్రధాని ఎన్నిక రసవత్తరంగా మారింది. ప్రధాని రేసులో మొన్నటి దాకా వెనుకబడిన లిజ్ ట్రస్ ఇటీవల అనూహ్యంగా ముందుకు దూసుకు వచ్చారు. కన్జర్వేటివ్ పార్టీ మద్దతుతో రిషి సునక్ తుది పోరులో నిలిచారు. కానీ ప్రస్తుతం ఆయనకు ఆశించిన మేర ఎంపీలు మద్దతు లభించడం లేదని తెలుస్తోంది.
ప్రధాని రేసులో వెనకబడి ఉన్న విషయాన్ని రిషి సునాక్ ఇటీవల బహిరంగంగా ఒప్పుకున్నారు. తాజాగా బ్రిటన్ లోని గ్రాంథాం నగరంలో సునాక్ ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో తాను వెనకబడి ఉన్నానని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి సందేహమూ లేదన్నారు.
లిజ్ ను ప్రధానిగా చేయాలని పార్టీలోని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన చెప్పారు. కానీ, కొందరు పార్టీ సభ్యులు మాత్రం ప్రత్యామ్నాయం కావాలని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. వారంతా తాను చెప్పేది వినడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.
మరోవైపు రిషి సునాక్ కాకుండా మరెవరినైనా ప్రధాని పీఠం ఎక్కించాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భావిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బ్రిటిష్ అంతర్జాతీయ మార్కెట్ పరిశోధన సంస్థ యూగవ్ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సునాక్ కు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చినట్టు యూగవ్ పేర్కొంది.
ఇప్పటి వరకు వివిధ దశల ఎన్నికల్లో అత్యధికులు సునాక్ కు అండగా ఉన్నారు. కానీ ఇప్పుడు జరగబోయే తుది పోరులో లక్షా 60వేల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ప్రధానిని ఎన్నుకోనున్నారు. వీరిలో అత్యధిక ఓట్లు ఎవరికి వస్తాయో వారే బ్రిటన్ ప్రధాని అవుతారు. అగస్టు 4 నుంచి సెప్టెంబర్ మెుదటివారం వరకు మొత్తం 12 విడతలుగా తుది పోరు జరగనుంది.