బ్రిటన్‌లో అక్రమ వలసలను అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకు వచ్చింది. దీంతో దేశంలో అక్రమ వలసలను ఉక్కు పాదంతో అణచి వేసేందుకు బ్రిటన్ ప్రభుత్వానికి విశేష అధికారాలు లభించాయి. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారిని గుర్తించి అరెస్టు చేస్తామన్నారు.
ఆ తర్వాత వారిని కొన్ని వారాల్లో వారి దేశాలకు పంపించి వేస్తామని సునాక్ వెల్లడించారు. అలాంటి వారిని మరోసారి దేశంలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తామని చెప్పారు. ఆ ఆదేశాలను ఉల్లంఘించే వారిపై కఠినమైన చర్యలు తీసుకోనున్నట్టు ఆయన తెలిపారు.
కానీ రిషి సునాక్ సర్కార్ తీసుకు వచ్చిన అక్రమ వలసల నిరోధక బిల్లుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొత్తగా తీసుకు వచ్చిన బిల్లుపై హక్కుల కార్యకర్తలు, సామాజిక ఉద్యమకారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి.
కానీ అక్రమ వలసల విషయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వెనక్కి తగ్గడం లేదు. దేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ వలసలను అనుమతించబోమని తేల్చి చెప్పారు. ఇంగ్లీష్ ఛానెల్ గుండా చిన్న చిన్న బోట్ల ద్వారా అక్రమంగా ప్రవేశించే వాళ్లపై బ్రిటన్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.