మకర సంక్రాంతి.. పొంగల్ పండుగను లండన్ లో ఘనంగా జరుపుకున్నారు. ప్రధాని రిషి సునాక్ భారతీయ పండుగ సంప్రదాయాన్ని చెక్కుచెదరకుండా పాటించారు. ఈ పండుగను పురస్కరించుకుని ఆయన తన కార్యాలయంలోని సిబ్బందికి విందునిచ్చిన వైనం వీడియోలు, ఫొటోలుగా వైరల్ అవుతున్నాయి. భారతీయ సంప్రదాయం అక్కడ వెల్లివిరిసింది.
పచ్చని అరటి ఆకుల్లో వడ్డించిన వంటకాలను స్టాఫ్ ఇష్టంగా తిన్నారు. కొందరు మాత్రం స్పూన్లను ఉపయోగిస్తే పలువురు తమ చేతులతోనే వంటకాలను తినడం విశేషం. ఇడ్లీ, చెట్నీ, అరటి పండ్లు.. ఇలా ఇవి కూడా అరటి ఆకుల్లో దర్శనమిచ్చాయి. బ్రిటన్ లోని భారతీయులకు, ముఖ్యంగా తమిళులకు రిషి సునాక్ పొంగల్ శుభాకాంక్షలు ప్రకటించారు.
దేశ వ్యాప్తంగా ఈ పండుగ మీ కుటుంబాల్లో సంతోషం నింపాలని కోరుకుంటున్నానన్నారు. మీరంతా మీ ఆప్తులతో కలిసి వస్తే మీరు ఈ దేశానికి చేస్తున్న సేవలకు, మీ త్యాగ నిరతికి గాను మీకు ధన్యవాదాలు తెలియజేస్తానని ఆయన ఓ సందేశంలో పేర్కొన్నారు. మీ కుటుంబాలు అంటూ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
యూరప్ సహా అనేక దేశాల్లో నివసిస్తున్న తమిళుల సంఖ్య పెరుగుతోంది. ఇండియాలో.మాదిరే మూడు రోజులపాటు వారు సంక్రాంతి పండుగను జరుపుకొంటున్నారు. ఇండియాలో ఉత్తరాదిన లోహ్రి అని, దక్షిణాదిన పొంగల్ అని, గుజరాత్ లో ఉత్తరాయణ్ అని.. ఇలా వేర్వేరు పేర్లతో ఈ ఫెస్టివల్ ని ప్రజలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.