బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ పై విమర్శలు వెల్లువెత్తాయి. లండన్ నుంచి లీడ్ స్ కు వెళ్లడానికి బిట్రన్ ప్రధాని 14 సీట్లుండే ఆర్ఏఎఫ్ జెట్ ను ఉపయోగించారు. అరగంట ప్రయాణానికి ఇంత ఆర్భాటం అవసరమా అనే ప్రశ్నలు తలెత్తాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు బ్రిటన్ లో జోరుగా వైరల్ అవుతున్నాయి. లీడ్స్‌లో ఓ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించేందుకు ఏకంగా ప్రైవేట్ జెట్ లో ప్రయాణించి డబ్బును వృధా చేస్తున్నారని కన్జర్వేటివ్ పార్టీ నేతపై ఆరోపణలు వినిపిస్తున్నాయని ది మిర్రర్ పేర్కొంది.
ఎన్‌హెచ్ఎస్ రోగులు, సిబ్బందిని కలిసేందుకు రూత్ ల్యాండ్ హెల్త్ కేర్ సెంటర్ ను సందర్శించేందుకు రిషి సునాక్ సోమవారం ఆర్ఏఎఫ్ విమానంలో బయలుదేరారు. ప్రైవేట్ జెట్ లో ప్రయాణిస్తూ రిషి సునాక్ ప్రజాధనంతో షో చేస్తున్నారని లేబర్ పార్టీ డిప్యూటీ నేత ఏంజిలా రేనర్ ఆరోపణలు చేశారు.
ఎన్‌హెచ్ఎస్‌లో వింటర్ క్రైసిస్ తో రోగులు, సిబ్బంది ప్రభుత్వం నుంచి సాయం కోసం వేచిచూస్తుంటే బ్రిటన్ ప్రధాని మాత్రం ఫోటోలకు ఫోజులిచ్చే పనిలో బిజీగా ఉన్నారని మండిపడ్డారు.
36 నిమిషాల ప్రయాణానికి ప్రైవేట్ జెట్ లో విహారానికి పన్ను చెల్లింపుదారుల డబ్బు ఎంత వృధా చేశారో రిషి సునాక్ వెల్లడించాలని లేబర్ పార్టీ డిమాండ్ చేసింది. అయితే దీనిపై టెన్ డౌనింగ్ స్ట్రీట్ రియాక్ట్ అవుతూ.. సమయాభావంతోనే రైలు ప్రయాణానికి బదులు ప్రధాని రిషి సునాక్ విమానంలో వెళ్లాల్సి వచ్చిందని తెలిపింది.