బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఈరోజు ఓ ప్రకటన చేయనున్నట్టు సమాచారం.
పలు వివాదాల నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పై సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. మంగళవారం నుంచి ఇప్పటి వరకు 50 మంది మంత్రులు, మరో ముగ్గురు కేబినెట్ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు.
ఈ నేపథ్యంలో రాజీనామా చేయాలంటూ ప్రధాని బోరిస్ పై పార్టీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి ఒత్తిళ్లకు తలొగ్గి రాజీనామా చేస్తున్నట్టు సమాచారం.
గత కొంత కాలంగా బోరిస్ జాన్సన్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. కరోనా సమయంలో తన అధికారిక నివాసంలో పార్టీలు నిర్వహించి బోరిస్ విమర్శల పాలయ్యాడు. ఈ విషయంలో ఇప్పటికే పలుమార్లు దేశ ప్రజలకు, పార్లమెంట్ కు క్షమాపణలు చెప్పారు.
గత నెలలో బోరిస్ జాన్సన్ ప్రభుత్వం అవిశ్వాస పరీక్షను ఎదుర్కొంది. ఈ పరీక్షలో ఆయన కొద్దిలో తప్పించుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా స్వపక్ష అధికార కన్జర్వేటివ్ ఎంపీలు ఓటు వేశారు. అయినప్పటికీ పదవీ గండం నుంచి ఆయన గట్టెక్కారు.
ఇటీవట ప్రభుత్వ మాజీ డిప్యూటీ చీఫ్ విప్ క్రిస్ పించర్ ఓ వివాదంలో ఇరుక్కున్నారు. పించర్ నడవడిక గురించి పూర్తిగా తెలిసినా ఆయన్ని ప్రాధాన్యత గల ప్రభుత్వ పదవిలో నియమించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
పార్టీ గేట్ విషయంలోనూ మొదట తనకేమీ తెలియదని మాట్లాడిన ఆయన ఆ తర్వాత క్షమాపణ చెప్పారు. ఇప్పుడు క్రిస్ పించర్ విషయంలోనూ ఇదే తరహాలో బోరిస్ వ్యవహరించారు. ఈ నేపథ్యంలో రాజీనామా చేయాలంటూ ప్రధానిపై ఒత్తిళ్లు పెరిగాయి.
తాను వెనక్కు తగ్గబోనంటూ బోరిస్ స్పష్టం చేశారు.
ఇక మంగళవారం అనూహ్య పరిస్థితుల్లో బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునాక్ (ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు), ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్ లు తమ పదవుల నుంచి వైదొలిగారు.
వీరితో పాటు 40 మందికిపైగా సునాక్ బాటలో నడిచారు. సునాక్ స్థానంలో ఆర్థిక మంత్రిగా నదీమ్ జహావీని నియమించారు. ఈ క్రమంలో 36 గంటల వ్యవధిలోనే బోరిస్‌కు వ్యతిరేకంగా నదీమ్ జహావీ లేఖ రాశాడు. ప్రధాని తక్షణమే రాజీనామా చేయాలని నదీమ్ తన లేఖలో డిమాండ్ చేశారు. ఈ లేఖ విడుదలైన కొద్ది సేపటికే తాను పదవి నుంచి తప్పుకోనున్నట్టు వార్తలు వచ్చాయి.