హైదరాబాద్ లో మళ్ళీ కరోనా కొత్త స్ట్రెయిన్ టెన్షన్ నెలకొంది. బ్రిటన్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికుల్లో చాలామందికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అవుతోంది. బ్రిటన్ నుంచి హైదరాబాద్‌కు ఇప్పటి వరకు 5 విమానాలు రాగా, అందులో వచ్చిన వారిలో 15 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వీరిలో కొత్త స్ట్రెయిన్ ఉందా అని నిర్దారించేందుకు అధికారులు శాంపిల్స్ లాబ్స్ కు పంపుతున్నారు. వారు కూర్చున్న సీట్లకు ముందు, వెనక మూడు వరుసల్లోని ప్రయాణికులను క్వారంటైన్ చేసే పనిలో ఉన్నారు.
బ్రిటన్‌లో విమానం ఎక్కడానికి 72 గంటల ముందు కరోనా టెస్టు చేయించుకున్నా ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగటివ్ వచ్చిన ప్రయాణికులకు కూడా ఇక్కడ దిగిన తర్వాత కరోనా పాజిటివ్‌గా తేలడం కలకలం రేపుతోంది. కొత్తగా నమోదైన 15 కేసులు ఆ కోవకు చెందినవే. దీంతో పాజిటివ్ వచ్చిన ప్రయాణికులతో కలిసి మరో 300 మందిని క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.