రష్యా క్షిపణి దాడులతో ఉక్రెయిన్ మరోసారి ఉలిక్కి పడింది. ఉక్రెయిన్‌లోని ఒడెశా, చెర్కసీ, క్రీవీ రిహ్‌తో పాటు పలు నగరాలపై రష్యా దాడులు చేసినట్టు ఉక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు. ఆయా నగరాల్లో రష్యా దాడుల్లో ఇండ్లతో పాటు భవనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. ఈ దాడుల్లో పలువురు పౌరులు కూడా మరణించారని చెప్పారు.
ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగినట్టు వెల్లడించారు. క్షిపణి దాడితో పంపింగ్ స్టేషన్లకు విద్యుత్ సౌకర్యం నిలిచిపోయిందన్నారు. ఒడెశాలోని నీటి పంపిణీ సంస్థ నిలిచిపోయిందన్నారు. ఈ క్రమంలో నగరం మొత్తానికి నీటి సరఫరా నిలిచిపోయిందన్నారు.
శత్రువులు ఉక్రెయిన్ భూభాగంపై మరోసారి క్షిపణి దాడులు చేసినట్టు అధ్యక్ష కార్యాలయ ఉపాధ్యక్షుడు కిరిలో టిమోషెంకో సోషల్ మీడియాలో తెలిపారు. రష్యా దాడుల నేపథ్యంలో దేశమంతటా అప్రమత్తత ప్రకటించామని, ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశామన్నారు.
దక్షిణ రష్యాలోని భూభాగంతో పాటు కాస్పియన్, నల్ల సముద్రాల్లోని యుద్ధ నౌకలు, ఆ దేశ వ్యూహాత్మక బాంబర్ల నుంచి క్షిపణుల దాడి జరిగినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం అధికార ప్రతినిధి యూరి ఇహ్నాత్ చెప్పారు. రష్యా ప్రయోగించిన మొత్తం 70 క్షిపణుల్లో 60 క్షిపణులను అడ్డుకున్నామన్నారు.
ఇది ఇలా వుంటే రష్యాలోని రెండు వైమానిక స్థావరాల్లో పేలుళ్లు జరిగాయని ఆ దేశ మీడియా వెల్లడించింది. కానీ పేలుళ్లకు కారణామేంటన్నది ఇప్పటి వరకు తెలియరాలేదు. దీనిపై ఇటు ఉక్రెయిన్, అటు రష్యా అధికారులు స్పందించకపోవడం గమనార్హం.
రియాజన్ వైమానిక స్థావరంలో చమురు ట్రక్కు పేలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు మృతి చెందారని ఆర్ఐఏ నోవోస్తీ వార్తా సంస్థ పేర్కొంది. దీంతో పాటు మరో ఆరుగురు సైనికులు గాయపడ్డారని, ఓ విమానం కూడా దెబ్బతిన్నట్లు వివరించింది.
సరతోవ్ ప్రాంతంలో ఏంజెల్స్ వైమానిక స్థావరంలో పేలుడు చోటుచేసుకుందంటూ వస్తున్న కథనాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పరిశీలిస్తున్నామని అధికారులు అన్నారు. ఈ స్థావరంలో రష్యా ప్రతిష్ఠాత్మకంగా భావించే టీయూ-95, టీయూ-160 వ్యూహాత్మక బాంబర్లను కూడా నిలిపి ఉంచుతారు. వీటికి అణ్వాయుధాలను కూడా మోసుకుపోగల సామర్థ్యం ఉంది.
ఇక గత అక్టోబరులో ట్రక్కు బాంబు దాడిలో క్రిమియా వంతెన ధ్వంసమైంది. తాజాగా ఈ వంతెనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం మెర్సిడెస్ వాహనాన్ని నడిపారు. ఈ సందర్భంగా వంతెన మరమ్మత్తు పనులను ఆయన పరిశీలించారు. నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులతో ఆయన సంభాషించారు. ఈ మేరకు ప్రభుత్వ సీనియర్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.