ఉక్రెయిన్ విమానాన్ని తామే కూల్చివేశామని ఇరాన్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఉక్రెయిన్ స్పందించింది. విమానాన్ని కూల్చివేసినందుకు క్షమాపణ చెప్పాలని…నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ఘటనపై పూర్తి బహిరంగ దర్యాప్తుకు, బాధితులకు న్యాయం చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్దిమిర్జ్ జెలెన్ స్కీ డిమాడ్ చేశారు. దర్యాప్తులో తాత్సర్యం ఉండబోదని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ కు చెందిన 45 మంది దర్యాప్తు అధికారులు ఇరాన్ లోనే ఉన్నారని…వారికి దర్యాప్తులో సహకరించాలని కోరారు.
ఉక్రెయిన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం పొరపాటున తమ మిస్సైల్ దాడిలో కూలిపోయిందని…జరిగిన సంఘటనకు తాము తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. ఇది మానన పొరపాటుగా పేర్కొంది. విమానం కూల్చివేతతో అందులో ప్రయాణిస్తున్న 175 మంది మరణించారు. ఇరాన్ రాజధాని టెహరాన్ నుంచి బుధవారం బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపట్లోనే టెహరాన్ శివారులో కుప్ప కూలింది. విమానం ఆకాశంలో ఉండగానే మంటలంటుకొని అగ్ని గోళంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కొందరు స్థానికులు మంటలంటుకొని కూలిపోతున్న విమానాన్ని మొబైల్ ఫోన్లలో షూట్ చేశారు.
విమానం కూల్చివేత ఇరాన్ పనేనని అమెరికా, కెనడా దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. అయితే ఆ వార్తలను మొదట ఖండించిన ఇరాన్ ఆ తర్వాత తమ పొరపాటును అంగీకరించింది.