ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్ దాడులు చేసింది. రాజధాని కీవ్ పై కమికేజ్ డ్రోన్లతో రష్యా విరుచుకుపడినట్టు ఆ దేశ అధ్యక్ష సలహాదారు ఆరోపణలు చేశారు. కీవ్ ను పూర్తిగా నాశనం చేసేందుకు రష్యా అత్యంత ఆసక్తిగా ఉన్నట్టు అధ్యక్ష ఆఫీసు అధిపతి ఆండ్రీ యెర్‌మాక్ తెలిపారు.
సెంట్రల్ షెవ్‌చెవిన్‌స్కీ ప్రాంతంలోని నివాసం భవనం ఒకటి ధ్వంసమైనట్లు కీవ్ నగర మేయర్ విటాలీ క్లిచ్‌కో వెల్లడించారు. వారం క్రితం కూడా కీవ్ నగరంలో రష్యా క్షిపణులు విధ్వంసం సృష్టించాయి. ఆ క్షిపణి దాడుల్లో మొత్తం 20 మంది వరకు మరణించారు.
ఈ రోజు ఉదయం నుంచే దాడులు మొదలయ్యాయి. ఉదయం 6.30 నిమిషాల నుంచే పేలుళ్ల శబ్దాలు వినిపించాయని అధికారులు తెలిపారు. మొత్తం ఐదు సార్లు ఆ శబ్దాలు వినిపించాయని పేర్కొన్నారు. సిటీ సెంటర్ ప్రాంతంలో రెండు పేలుళ్ల శబ్ధాలు వినిపించాయని చెప్పారు.
రష్యాను నిలువరించేందుకు మరిన్ని రక్షణ వ్యవస్థలు కావాలని, గగనతలానికి రక్షణ కవచంగా నిలిచే ఆయుధాలు అవసరమని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. కమికేజ్ డ్రోన్ కుప్పకూలిన ఫోటోలను నగర మేయర్ సామాజిక మాద్యమాల్లో షేర్ చేశారు.
కమికేజ్ డ్రోన్లు అనేవి అంత్యంత చిన్నపాటి ఏరియల్ ఆయుధాలు. వీటిని ప్రయోగించినప్పుడు లక్ష్యాలను తాకిన వెంటనే పేలిపోతాయి. చాలా వరకు డ్రోన్లు టార్గెట్లపై బాంబులు వేసి తిరిగి వస్తాయి. కానీ కమికేజ్ డ్రోన్లు మాత్రం అక్కడే పేలిపోతాయి.