ఉక్రెయిన్ పై రష్యా మరోసారి బాంబుల వర్షం కురిపించింది. ఉక్రెయిన్‌కు అత్యాధునిక యుద్ధ ట్యాంకులు సరఫరా చేస్తామన్న అమెరికా ప్రకటన నేపథ్యంలో రష్యా క్షిపణి దాడులతో విరుచుకుపడింది. దీంతో ఈ ఏడాదిలో మొదటి సారిగా రాజధాని కీవ్స్‌లో యుద్ద సంబంధిత మరణాలు నమోదయ్యాయి.
ఈ దాడుల్లో 11 మంది మరణించారు. మరో 12 మందికి తీవ్ర గాయాలైనట్టు అధికారులు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా నిన్న ఒక్క రోజే 50కి పైగా క్షిపణులతో రష్యా దాడులు చేసినట్టు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. రాజధాని కీవ్ లో ఒక్కరు మరణించినట్టు కీవ్ మేయర్ విటాలీ లీష్చాకో తెలిపారు.
న్యూ ఇయర్ వేడుకల తర్వాత తొలిసారిగా కీవ్ లో యుద్ధం మరణం సంభవించిందన్నారు. ఇటీవల ఉక్రెయిన్‌లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ లోని విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా రష్యా దాడులకు పాల్పడుతోంది.
దేశంలో ఎనర్జీ సిస్టమ్‌ను ధ్వంసం చేసే ఉద్దేశంతో రష్యా దాడులకు పాల్పడుతోందని ఎనర్జీ మినిస్టర్ గలుష్‌చెన్కో ఆరోపించారు. దేశంలోని పలు సబ్ స్టేషన్లపై రష్యా దాడులకు ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు.