ఓ వైపు ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తోంది. ఎందరో సైనికులు, పౌరులు మృత్యువాత పడుతున్నారు. ఎక్కడ చూసినా శవాల గుట్టలే కనిపిస్తున్న తరుణంలో కూడా ఉక్రెయిన్ యువత పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.
కాలం కలిసి వస్తే జీవితం కొనసాగిస్తామని.. లేదంటే భార్యభర్తలుగానే చనిపోతామని ఉక్రెయిన్ ప్రేమికులు ఇహోర్ జక్వాట్‌స్కి, కేథరినా లైట్వినెంకో అంటున్నారు. కీవ్ లోని చర్చిలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుతం మార్షల్ లా కొనసాగుతోంది. సైనికులు, సాధారణ పౌరుల వివాహాలకు ఈ చట్టంలో వెసులుబాటు ఉంది. అదే రోజు దరఖాస్తు చేసుకొని, వివాహం పూర్తి చేసుకునే అవకాశం ఈ చట్టం కల్పిస్తోంది.
రాజధాని కీవ్‌లోనే నాలుగు వేలకు పైగా జంటలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాయి. సాధారణ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న నెల రోజుల తర్వాతే వివాహం చేసుకోవాల్సి వచ్చేది.
యుద్ధం ప్రారంభమైన తర్వాత మూడు నెలల పాటు వివాహ రిజిస్ట్రేషన్లు జరగలేదు. ఇటీవల కీవ్‌లోని సెంట్రల్ సివిల్ రిజిస్ట్రీని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చారు.
ఏప్రిల్‌లో రష్యా సేనలు కీవ్ పరిసరాల నుంచి వైదొలిగాక పెళ్లిళ్లు జోరందుకున్నాయి. వివిధ దేశాలకు శరణార్థులుగా వెళ్లిన చాలా మంది ఉక్రెయిన్‌కు తిరిగొచ్చారు.రేపు ఏం జరుగుతుందో తెలియదు. అందుకే త్వరగా వివాహం చేసుకుంటున్నాం’ అని కొత్త పెళ్లికూతురు డేరియా పొనోమకెరెంకో(22) తెలిపారు. యుద్ధం నేపథ్యంలో పోలాండ్‌కు వెళ్లిపోయిన ఆమె.. ఇటీవల కీవ్‌కు తిరిగొచ్చారు.
18-60 ఏళ్ల మధ్య వయసు గల పురుషులు దేశం దాటి వెళ్లొద్దనే నిబంధన ఉన్నందున ఆమె బాయ్‌ఫ్రెండ్ యెవ్హెన్ నాలివైకో(23) ఉక్రెయిన్‌లోనే ఉండిపోయారు. పరిస్థితి అనుకూలించగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కటైపోయిందీ జంట.
‘ఇలాంటి పరిస్థితుల్లో మనుషులు నిజాయితీతో వ్యవహరిస్తారు. యుద్ధం వచ్చినా, మరే సమస్య ఎదురైనా జీవితం కొనసాగాల్సిందే’ అని అన్నా కార్పెంకో(30) చెబుతున్నారు. ఏడేళ్లుగా డేటింగ్ చేసిన వ్యక్తిని ఆమె వివాహమాడారు.
కొత్త వివాహాలే కాకుండా.. ఇప్పటికే ఒక్కటైన జంటలు కూడా మరోసారి తమ వాగ్దానాలను గుర్తు చేసుకుంటున్నాయి. చర్చిలో రెండోసారి వివాహాలు చేసుకుంటున్నాయి. 18ఏళ్ల క్రితమే వివాహం చేసుకున్న పావ్లో, ఒక్సానా సావ్రిహా దంపతులు మరోసారి పెళ్లి చేసుకున్నారు.