ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా జపోరిజియా నగరంపై శనివారం అర్ధరాత్రి రష్యా భీకర దాడులు చేసింది. రష్యా దాడుల్లో సుమారు 17 మంది మరణించారని అధికారులు పేర్కొన్నారు. దీంతో పాటు పలువురు గాయాలపాలయ్యారు.
నగరంలో ఐదు ఇండ్లు నేలమట్టం అయ్యాయి. మరో 40 వరకు నివాసాలు ధ్వంసమైనట్టు నగర కౌన్సిల్ సెక్రటరీ పేర్కొన్నారు. మరో వైపు ఉక్రెయిన్ సైన్యం కూడా ఈ దాడులను ధ్రువీకరించింది. గత కొన్ని రోజులుగా జపోరిజియా నగరంపై రష్యా తరుచూ దాడులకు పాల్పడుతోంది.
రష్యా-క్రిమియాను కలిపే కెర్చ్ రోడ్డు, రైలు బ్రిడ్జిపై శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ క్రమంలోనే దాడులు జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దాడిలో ముగ్గురు మరణించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ పేలుడు ఘటనపై రష్యా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
వంతెనపైకి వెళ్లే వాహనాలన్నింటినీ అత్యాధునిక పరికరాలతో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయినప్పటికీ పేలుడు ఎలా జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. పేలుడుకు కారణమైన ట్రక్ యజమానిని అధికారులు గుర్తించారు. అతన్ని దక్షిణ రష్యాలోని క్రాస్నాడర్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు.