ఉక్రెయిన్ పై రష్యా ఎప్పటికీ విజయం సాధించలేదని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అన్నారు. సామ్రాజ్యాన్ని పునర్నిర్మించాలనే పట్టుదలతో ఉన్న నియంత ప్రజల స్వేచ్ఛ, ప్రేమను ఎప్పటికీ తగ్గించలేడని ఆయన పేర్కొన్నారు. స్వేచ్ఛా సంకల్పాన్ని క్రూరత్వం ఎప్పటికీ నాశనం చేయలేదని ఆయన వెల్లడించారు.
ఉక్రెయిన్ పై రష్యా దాడులకు ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఆయన ఉక్రెయిన్ పొరుగు దేశం పోలాండ్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న పశ్చిమ దేశాల సంకల్పాన్ని ఉక్రెయిన్ రష్యా యుద్దం కఠినతరం చేసిందన్నారు.
ఈ యుద్దంలో ఉక్రెయిన్ బలంగా ఉందన్నారు. అంతకు మించి ఉక్రెయిన్ గర్వంగా, ఉన్నతంగా ఉందన్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్ స్వేచ్ఛగా ఉందన్నారు. పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు.
రష్యాపై దాడి చేసేందుకు పశ్చిమ దేశాలు ఎలాంటి కుట్రలూ పన్నడం లేదన్నారు. రష్యాలోని కోట్లాది మంది ప్రజలు తమ పొరుగు దేశాల వారితో శాంతి సామరస్యాలతో ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు. పొరుగు దేశాల నుంచి వారు శత్రుత్వాన్ని కోరుకోవడం లేదన్నారు.