ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలపై దాడులను తీవ్రం చేస్తోంది రష్యన్ ఆర్మీ. కీవ్, ఖార్కీవ్ ప్రాంతాల్లో బాంబు దాడులను పెంచింది. ప్రధాన నగరాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, టీవీ టవర్, పోలీస్ బిల్డింగ్ పై బాంబు దాడులు చేస్తున్నాయి రష్యా సేనలు. ఈ దాడులకు దీటుగా బదులిచ్చేందుకు ఉక్రెయిన్ సేన గట్టిగానే ప్రయత్నిస్తోంది. కానీ.. రష్యా బలగాలను పూర్తిగా కట్టడి చేయలేకపోతున్నారు ఉక్రెయిన్ సైనికులు. దీంతో అక్కడి పౌరులు రంగంలోకి దిగారు. రష్యాను ప్రతిఘటించడానికి పెట్రో బాంబులను వాడాలని నిర్ణయించుకున్నారు ఉక్రెయిన్ ప్రజలు.
ఈ పెట్రో బాంబుల ద్వారా రష్యాను ఎదుర్కొంటామని.. కీవ్ ప్రాంతాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేస్తున్నారు అక్కడి పౌరులు. కీవ్ ప్రాంతానికి రక్షణగా తాము ఉంటామని.. పెట్రో బాంబులతో రష్యాకు బదులిస్తామని అంటున్నారు. తాము యుద్ధానికి ఏమాత్రం భయపడటం లేదని అంటున్నారు. తమ మాతృభూమి కోసం పోరుడుతామని అంటున్నారు. తామేమీ రష్యాకు భయపడటం లేదని అంటున్నారు. మేము కూడా మంచి పోరాట యోధులమే అని స్పష్టం చేస్తున్నారు.
మోలటోవ్ మాక్‌టెయిల్ అంటే హోమ్ మేడ్ పెట్రోల్ బాంబులతో ఉక్రెయిన్ పౌరులు అలెర్ట్ గా ఉన్నారు. అల్లర్లు జరిగినప్పుడు ఉపయోగించే వీటిని ఇప్పుడు రష్యా సైన్యంపై వాడండి అంటూ ప్రజలకు సూచించింది ఉక్రెయిన్ రక్షణశాఖ. వాటిని ఎలా తయారు చేయాలో కూడా పౌరులకు వివరించింది. దీంతో ఇంట్లో ఉన్న పాతసీసాలను బయటకు తీస్తున్నారు. ఇప్పటికే పెట్రో బాంబులను సిద్ధం చేశారు. ఆ బాంబులనే రష్యా సైన్యంపైకి విసిరి.. సొంత గడ్డ కోసం పోరాడుతున్నారు.
ఇప్పటికే.. రష్యా సైన్యాన్ని ఎదుర్కోవడానికి అక్కడి పౌరులకు ఆయుధాలు ఇచ్చింది ఉక్రెయిన్ ప్రభుత్వం. అంతేకాకుండా..ఉక్రెయిన్ లోని సెలబ్రెటీలు సైతం అక్కడి సైన్యానికి అండగా నిలుస్తున్నారు. తాము యుద్ధంలో పాల్గొంటామని.. దేశాన్ని కాపాడుకోవడానికి ఏమైనా చేస్తామని ప్రకటించారు. తాజాగా ఈ పెట్రో బాంబులతో రష్యాకు చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు ఉక్రెయిన్ పౌరులు.