రష్యా, ఉక్రెయిన్ ల మధ్య ఏర్పడిన సంక్షోభంతో భారతీయ పౌరులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు సహాయక చర్యలను చేపట్టింది మోడీ ప్రభుత్వం. అందులో భాగంగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ కు మోడీ కాల్ చేసి మాట్లాడారు. భారతీయులను తమ భూబాగం నుండి ఇండియా తరిలించేందుకు సహకరించాలని కోరారు. అందుకు పుతిన్ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.
ఉక్రెయిన్ లోని ఖార్కివ్ నగరంలో ఉన్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు తమ సాయుధ బలగాలు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఖార్కివ్ నగరం నుంచి భారతీయులు వెళ్లిపోకుండా ఉక్రెయిన్ యంత్రాంగం అడ్డుకుంటోందని రష్యా రక్షణ శాఖ ఆరోపించింది. భారతీయులను ఉక్రెయిన్ సైనికులు మానవ రక్షణ కవచాలుగా ఉపయోగించుకుంటున్నారని పర్కొంది.
భారత్ లో ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పొలిఖా ఈ ఆరోపణలను ఖండించారు. రక్తమోడుతూ కూడా ఉక్రెయిన్.. విదేశీ పౌరులను దేశం దాటించేందుకు సహకరిస్తోందని చెప్పారు. భారతీయులు ఖార్కివ్ నగరాన్ని ఖాళీ చేసి పశ్చిమ సరిహద్దులకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు. భారత్ సహా విదేశీ విద్యార్థుల కోసం హాట్ లైన్ ఏర్పాటు చేసినట్లు.. ఉక్రెయిన్ విదేశాంగ శాఖ వెల్లడించింది.
మరోవైపు ఉక్రెయిన్ లో భారత విద్యార్థులు బందీలుగా ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. వాటిపై విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. ఉక్రెయిన్ లోని ఎంబసీ భారతీయ పౌరులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని స్పష్టం చేసింది. ఉక్రేనియన్ అధికారుల సహకారంతో చాలా మంది విద్యార్థులు బుధవారం ఖార్కివ్ నుంచి బయలుదేరారని స్పష్టం చేసింది.