ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న మారణకాండ కోనసాగుతూనే ఉంది. రష్యా సైనిక చర్యతో ఇప్పటికే అనేక దేశాలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి కీలక విషయాలను బయటపెట్టింది. రష్యా దాడి నేపథ్యంలో ఇప్పటివరకు 60 లక్షల మందికిపైగా ఉక్రెయిన్ ప్రజలు దేశాన్ని వదిలి వెళ్లిపోయారని వెల్లడించింది. వారిలో మహిళలు, పిల్లలే అత్యధికంగా ఉన్నారని ప్రకటించింది.
ఉక్రెయిన్ పై ఫిబ్రవరి 24న రష్యా సైనిక చర్య ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ నెల 11 వరకు 60,29,705 మంది దేశ సరిహద్దులు దాటివెళ్లారని ఐరాస పేర్కొంది. ఎక్కువగా పోలండ్ లో ఆశ్రయం పొందుతున్నట్టు తెలిపింది. కాగా.. 18-90 ఏండ్ల వయస్కులైన పురుషులు యుద్ధంలో పాల్గొనాల్సి ఉన్నందును వారంతా దేశంలోనే ఉండిపోయారని వివరించింది.
మార్చి నెలలో యుద్ధ భూమి నుంచి 30.40 లక్షల మంది దేశం విడిచి వెళ్లారని పేర్కొంది. ఏప్రిల్ నాటికి ఆ సంఖ్య పది లక్షల 50 వేలకు తగ్గిందని వెల్లడించింది. మే నెల ప్రారంభం నుంచి 4.93 లక్షల మంది ఉక్రెయిన్ సరిహద్దులు దాటారని.. మొత్తంగా ఈ ఏడాది 80 లక్షల మంది పొరుగు దేశాలకు వలస వెళ్లే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తోంది.
రష్యా ఆధీనంలో ఉన్న క్రిమియా, స్వతంత్ర భూభాగాలుగా ఉన్న రెండు రీజియిన్లలోని ప్రజలను మినహాయించి.. ఉక్రెయిన్ మొత్తం జనాభా 3.70 కోట్లు ఉంది. అయితే.. రోజు సరిహద్దులు దాటుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోందని వెల్లడించింది ఐరాస.