– ఉక్రెయిన్, రష్యాల మధ్య అలుమున్న యుద్ధ మేఘాలు
– యుద్ధానికి సిద్ధం అవుతన్న ఉక్రెయిన్ ప్రజలు
– గన్ పట్టిన 79 ఏళ్ల వృద్ధురాలు
– దేశాన్ని రక్షించుకుంటానంటున్న బామ్మ
– యుద్ధాన్ని కోరుకోవడం లేదంటున్న రష్యా
– ఏ క్షణంలోనైనా దాడి జరగొచ్చు అంటున్న అమెరికా అధ్యక్షుడు
దేశం అంటే అభిమానం లేని పౌరుడు ఉండడు. తమ దేశానికి ఏదైనా నష్టం వాటిల్లుతోందంటే రక్తం మరుగకమానదు. ఇప్పుడు అదే తరహాలో తన దేశంపైకి పరాయి దేశం సైన్యం యుద్దానికి వస్తోందని తెలిసి ఉక్రెయిన్ కు చెందిన 79 ఏళ్ల వృద్ధురాలు గన్ పట్టడానికి సిద్ధం అయింది. ఆమే కాదు.. ఉక్రెయిన్ లో చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ.. ఎవరిని కదిలించినా ఇదే భావోద్వేగం. రష్యా ఆక్రమణ నుంచి దేశాన్ని రక్షించుకోవడానికి మేము సైతం అంటూ ఎదురుదాడి చేయడానికి ముందుకు వస్తున్నారు.
నేను దృఢమైన సైనికురాలిని కాకపోవచ్చు.. బరువైన ఆయుధాలను మోయలేకపోవచ్చు.. కానీ.. నా దేశం కోసం పోరాటం మాత్రం మానను.. నా దేశాన్ని ఓడిపోనివ్వను అంటూ ఉక్రెయిన్ కు చెందిన వాలెంటినా కోన్ స్టాంటీనొవాస్కా ఉద్విగ్నంగా చెప్తోంది. అయితే..రష్యా, ఉక్రెయిన్ మధ్య దశాబ్దాల పాటు జరుగుతున్న వివాదం ఇటీవల మరింత ముదిరింది. ఉక్రెయిన్ పై ముప్పేట దాడి చేసేందుకు అన్ని విధాల సిద్ధమైన రష్యా.. సరిహద్దుల్లో దాదాపు లక్షన్నర మంది సైనికులను మోహరించింది. ఏ క్షణమైనా తమపై దాడి జరిగే ప్రమాదం ఉండటంతో ఉక్రెయిన్ సైన్యం సర్వ శక్తులతో సిద్ధమైంది.
అదే సమయంలో ఆ దేశ ప్రజలు కూడా యుద్ధానికి మేము సైతం అంటూ సిద్ధమవుతున్నారు. సామాన్య పౌరులు కూడా ఆయుధాల వాడకంపై శిక్షణ తీసుకుంటున్నారు. ఈ శిక్షణకు చిన్నారులు, వృద్ధులు స్వచ్ఛందంగా ముందుకు రావడం గమనార్హం. అయితే.. తూర్పు ఉక్రెయిన్ లోని పోల్ లో 79 ఏళ్ల వాలెంటినా.. ఈ ట్రెయినింగ్ లో పాల్గొని జాతీయ భద్రతా సిబ్బంది నుంచి ఏకే-47 ను ఎలా ఉపయోగించాలనే దానిపై శిక్షణ తీసుకున్నారు. తుపాకీ చేతబట్టి లక్ష్యానికి గురిపెడుతున్న వాలెంటినా ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వృద్ధురాలి దైర్యానికి ఉక్రెయిన్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు అభినందిస్తున్నారు.
ఏదైనా జరిగితే కాల్పులు జరిపేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నా ఇంటిని, నా పిల్లలను, నా నగరాన్ని నేను రక్షించుకుంటాను. నా దేశాన్ని ఎన్నటికీ ఇతరుల చేతుల్లోకి వెళ్లనివ్వను. నేను బలహీనురాలినే కావొచ్చు. కానీ.. యుద్ధానికి సిద్ధమే అని చెబుతూ వాలెంటినా ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి రగిలిస్తున్నారు. ఆమెను చూసి యువత, ఇతర వృద్ధులు సైతం ఉత్సాహంగా శిక్షణ తీసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ పై తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని రష్యా తాజాగా ప్రకటించింది. దీంతో ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలు కన్పిస్తున్నాయి. సరిహద్దుల్లో సైనిక విన్యాసాల్లో పాల్గొన్న తమ బలగాలను పాక్షికంగా ఉపసంహరించుకుంటున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఈ దళాలు అక్కడి నుంచి వెనుతిరుగుతున్నాయి. అయితే.. ఎంత మంది సైనికులు వెనక్కి వచ్చేస్తున్నారన్న వివరాలను రష్యా వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ పై పొంచి ఉన్న యుద్ధమేఘాలు పూర్తిగా తొలగి పోలేదని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పేర్కొన్నారు. రష్యా దాడి చేయడానికి ఇంకా అవకాశాలు ఉన్నాయని తెలిపారు.