ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. యుద్దం ప్రారంభమైన రోజు నుంచి ఉక్రెయిన్ పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు ఉక్రెయిన్ లో ఎటు చూసిన రక్తపుటేరులు పారుతున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా వీటికి సంబంధించిన దృశ్యాలే కనిపిస్తున్నాయి.
తాజాగా రష్యా క్షిపణిదాడి నుంచి బయటపడిన ఓ ఉపాధ్యాయురాలు తలపై బ్యాండేజీ, రక్తంతో తడిసిన శరీరంతో, వీడియోలో మాట్లాడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఉక్రెయిన్ కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అంటూ ఆమె చేసిన భావోద్వేగ ప్రసంగాన్ని విని అందరూ సెల్యూట్ చేస్తున్నారు.
ఉక్రెయిన్ లోని చుగేవ్ నగరంపై రష్యా బాంబు దాడులు చేసింది. ఈ క్రమంలో ఒలేనా కురివ్ అనే ఉపాధ్యాయురాలి ఇంటిపై బాంబులు పడగా ఆమె ప్రాణాలతో బయటపడింది. ఆస్పత్రికి వెళ్లి వచ్చాక ముఖంపై మొత్తం రక్తపు మరకలు, తలపై బ్యాండేజీలతో ఆమె భావోద్వేగంగా మాట్లాడారు.
” నేను చాలా అదృష్టవంతురాలిని. అదృష్ట దేవత నావెంట ఉన్నది. నా జీవితంలో ఇలా అవుతుందని ఎప్పుడూ ఊహించలేదు. నేను ఉక్రెయిన్ కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఉక్రెయిన్ కోసం నేను చేయగలిగిందంతా చేస్తాను. నా ప్రాణం ఉన్నంత వరకు నా మాతృదేశం వైపే ఉంటాను” అంటూ ఆమె మాట్లాడుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.