ఉక్రెయిన్ లో ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ ముందుకెళ్తున్నాయి రష్యా బలగాలు. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసుకుంటూ తమ బలాన్ని ప్రదర్శిస్తున్నాయి. అయితే.. కొన్ని చోట్ల రష్యా సైన్యాన్ని సామాన్యులు నిలదీస్తున్నారు.
హెనిచెస్క్ సిటీలో ఓ మహిళ రష్యా సైనికులను కడిగిపారేసింది. మా గడ్డపై మీకేం పనంటూ శివగామిలా విరుచుకుపడింది. తుపాకులు, మెషిన్ గన్ తో ఉన్న రష్యా సైనికులను చూసి ఏమాత్రం భయపడకుండా నిలదీసింది.
ఆమెను శాంతింపజేసేందుకు ఓ రష్యా సైనికుడు ప్రయత్నం చేశాడు. ఇక్కడ సైనిక కసరత్తులు చేస్తున్నాం దయచేసి వెళ్లండని చెప్పాడు. అయినా కూడా ఆ మహిళ తగ్గలేదు. ఇది మా భూమి ఇక్కడికి ఎందుకొచ్చారని మండిపడింది.
ఉక్రెయిన్ గడ్డపై చనిపోయిన తర్వాత “పొద్దుతిరుగుడు పువ్వుల్లా పెరుగుతారు” మీ జేబుల్లో ఈ విత్తనాలను పెట్టుకోండి అని వ్యగ్యంగా చెప్పి ఇచ్చింది. ఈ భూమిపై మీకేం దొరకదంటూ కాసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోయింది. పొద్దుతిరుగుడు పువ్వులు ఉక్రెయిన్ జాతీయ పుష్పాలు.