ఉక్రెయిన్‌పై నెల రోజులగా రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యన్ సేనల భీకర దాడులను ఉక్రెయిన్ ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతూ.. రాజధానిని కాపాడుకుంటోంది. ఇరు దేశాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అయిన వెనకడుగు వేయకుండా ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోని ప్రభుత్వ సంపదను, ఆస్పత్రులను టార్గెట్ చేసుకుని బాంబులు విసురుతున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ వాసులు ఓ విగ్రహాన్ని కాపాడుకునేందుకు తెగ కష్టపడుతున్నారు. ఆ విగ్రహం రష్యా బాంబుల బారిన పడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ ఆ విగ్రహాం ఎవరిది.. ఉక్రెయిన్ వాసులు ఎందుకు అంతా కష్టపడుతున్నారు..?
ఉక్రెయిన్ దేశంలో ఖార్కివ్‌లోని ప్రధాన రహదారిపై చెట్లతో నిండిన విశాలమైన పార్క్‌లో టౌన్ సెంటర్లో.. ఆ దేశ జాతీయ కవి తారస్ షెవ్ చెంకో విగ్రహం ఉంది. ఆ విగ్రహం ఎత్తు 16 మీటర్లు ఉంటుంది. 1935లో షెవ్ చెంకో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సోషలిజం, స్టానిలిజం భావాలు మిక్స్ అయినట్లు ఈ విగ్రహాన్ని రూపొందించారు. విగ్రహం కింద భాగంలో విప్లవ సైనికులు ఉండగా, పైభాగంలో జాతీయ కవి తారస్ షెవ్ చెంకో ఉంటారు.
ప్రస్తుతం రష్యా బాంబు దాడుల నుంచి ఈ విగ్రహాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఖార్కివ్‌లో వెయ్యికిపైగా భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో ఆ విగ్రహం కూడా ధ్వంసం కాకుండా ఉండేందుకు అక్కడి ప్రజలు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం ఆ బ్లాక్ క్యాస్ట్ ఐరన్ స్టాచ్యూ చుట్టూ ఇసుక బ్యాగ్‌లను పెడుతున్నారు. ఇప్పటికే చాలా బ్యాగ్‌లను విగ్రహం చుట్టూ ఏర్పాటు చేశారు. పూర్తిగా విగ్రహాన్ని ఇసుక బ్యాగులతో కప్పేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా, 19వ శతాబ్ధానికి చెందిన తారస్ షెవ్‌చెంకో ఉక్రెయిన్ భాషలో గొప్ప పండితుడు. 1991లో సోవియెట్ యూనియన్ నుంచి ఉక్రెయిన్ విడిపోయిన విషయం తెలిసిందే. దేశంలోని ప్రతి నగరంలోనూ షెవ్‌చెంకో విగ్రహం లేదా సెంటర్ లేని నగరం లేదంటే అతిశయోక్తి కాదు. తర్వాత తరాలకు దేశ సంస్కృతి అందాలనే ఉద్దేశంతో ఉక్రెయిన్ జాతీయ కవి విగ్రహం ధ్వంసం కాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు ఉక్రెయిన్లు.