ఉక్రెయిన్ లోని నాలుగు ప్రాంతాలను తాము విలీనం చేసుకున్నామని, దీనిపై రెఫరెండం నిర్వహించాలని రష్యా చేసిన తీర్మానానికి ఐరాస సర్వ ప్రతినిధి సభలో చుక్కెదురైంది. దీన్ని ఖండిస్తూ సభ రూపొందించిన తీర్మానాన్ని 143 సభ్య దేశాలు సమర్థించాయి. 5 దేశాలు ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు చేశాయి. అయితే ఇండియా సహా 35 దేశాలు ఓటింగ్ కి దూరంగా ఉన్నాయి. ఇలాంటి తీర్మానమే భద్రతా మండలిలో వస్తే దీన్ని రష్యా వీటో చేసింది.
కానీ రెఫరెండం పేరిట రష్యా నాలుగు ప్రాంతాలను అక్రమంగా విలీనం చేసుకుందని తాజాగా ఐరాస కొత్త తీర్మానాన్ని ప్రతిపాదించింది. రష్యా చర్యలపట్ల తమ దేశ వైఖరిని భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ వివరిస్తూ.. ఉక్రెయిన్ లో జనావాసాలపై దాడులను తాము సమర్థించడం లేదన్నారు.
మానవ ప్రాణాలను పణంగా పెట్టి సైనిక పరంగా ఎలాంటి పరిష్కారాన్నీ కనుగొనలేమని ఆమె అన్నారు. తక్షణమే వైషమ్యాలకు స్వస్తి చెప్పి.. దౌత్యపరమైన చర్చలకు కూర్చోవాలని తాము కోరుతున్నామన్నారు. అంతర్జాతీయ చట్టాలను మేము గౌరవిస్తున్నామని, ఐక్యరాజ్యసమితి నిబంధనావళికి అనుగుణంగా వ్యవహరిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఏ దేశ సార్వభౌమాధికారాన్ని లేదా ఆ దేశ ప్రాంతీయ సమగ్రతను గౌరవించాలన్నది తమ సిధ్ధాంతమన్నారు. ఈ సూత్రాలను ప్రతిదేశమూ పాటించాల్సిందేనని చెప్పారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొనేలా చూసే ఏ ప్రయత్నానికైనా తాము సహకరిస్తామని రుచిరా కాంబోజ్ స్పష్టం చేశారు. వర్ధమాన దేశాలు ఇప్పటికే ఇంధనం, ఆహారం, ఎరువులు వంటి వివిధ రంగాల్లో కష్టాలను ఎదుర్కొంటున్నాయని ఆమె చెప్పారు. ఐరాస నిబంధనావళిని గౌరవిస్తూనే.. శాంతి మంత్రాన్ని జపిస్తుంటామని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చేసిన వ్యాఖ్యలను ఆమె గుర్తు చేశారు.