కేంద్రం ఇటీవల తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగుతూనే ఉంది. కేంద్ర మంత్రులు రైతులతో భేటీ అవుతూ చర్చిస్తున్నా… రైతన్నలు తమ డిమాండ్లపై ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. మరోవైపు ఈనెల 8న దేశవ్యాప్త బంద్ కు పిలుపిచ్చిన నేపథ్యంలో రైతుల ఉద్యమాన్ని శాంతింప చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుంది.
మరోవైపు రైతుల ఉద్యమం ఐక్యరాజ్యసమితి వరకు వెళ్లింది. రైతుల ఉద్యమాన్ని అడ్డుకోరాదని ఐరాస కోరింది. శాంతియుతంగా ప్రదర్శనలు చేసే హక్కు ప్రజలకు ఉందని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ అధికార ప్రతినిధి స్టిఫేనే జూరిక్ అన్నారు. శాంతియుత ప్రదర్శనలు చేసుకోవడానికి అధికార యంత్రాంగం అవకాశం కల్పించాలని కోరారు.
మరోవైపు బ్రిటన్ ఎగువ సభ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లోనూ రైతుల ఉద్యమ ప్రస్తావన వచ్చింది. లార్డ్ ఇంద్రజిత్ సింగ్ దీనిపై ప్రశ్నించగా.. కేబినెట్ ఆఫీసు మంత్రి లార్డ్ నికోలస్ ట్రూ సమాధానమిస్తూ ఇతర దేశాల వ్యవహారాలను ఖండించలేమన్నారు. రైతులు ఉద్యమానికి బ్రిటిష్ ఎంపీలు మద్దతు తెలిపారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్‌తో మాట్లాడాలని కోరుతూ బ్రిటన్ విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్‌కు వినతిపత్రం సమర్పించారు.