ఉత్తర భారత్‌లో చలి వణికిస్తోంది. కోల్డ్ వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. దేశ రాజధానిలో చలితో పాటు మంచు కూడా కురుస్తోంది. దీంతో ఢిల్లీ వాసులు ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితులు ఉన్నాయి.
ఈ క్రమంలో ఢిల్లీతో పాటు పంజాబ్, రాజస్థాన్, హర్యానాల్లో భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఆరెంజ్, యెల్లో అలర్ట్ ప్రకటించింది. వచ్చే వారం ఉత్తర భారత్ లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ పేర్కొంది.
పశ్చిమ కల్లోలాల వల్ల జనవరి 21 నుంచి 25 వరకు వాయవ్య భారత్‌లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు చెప్పింది. ఈ నెల 21 తెల్లవారుజామున పశ్చిమ హిమాలయ ప్రాంతంలో వర్షపాతం ప్రారంభమై ఈ నెల 25 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.
జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తర రాజస్థాన్‌లలో జనవరి 23, 24 తేదీల్లో తేలికపాటి నుండి వడగళ్ళ వాన కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ హెచ్చరికలు చేసింది.
పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ ప్రాంతాల్లో తీవ్రమైన చలి గాలులు వీచే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. పంజాబ్‌లోని గురుదాస్ పూర్, ఫిరోజ్ పూర్, జలంధర్, హోషియార్ పూర్, బటిండాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఫజిలికా, బర్నాలా, సంగ్రూర్, లూథియానా, ఫతేఘర్, సాహిబ్ ప్రాంతాల్లో యెల్లో అలర్ట్ ప్రకటించింది.
హర్యానాలోని సోనీపేట్, జజ్జర్, రేవారి, హిసార్ ప్రాంతాల్లో ఆరెంజ్, అంబాలా, కురుక్షేత్ర, బివానీ, పల్వాల్ ప్రాంతాల్లో యెల్లో అలర్ట్ జారీ చేసింది. యూపీలోని చాలా ప్రాంతాలకు ఐఎండీ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలో పొగమంచు కమ్ముకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో పలు విమానాలను రద్దు చేశారు.