– చేరికల కోసం ఎదురుచూపులు
– వేధిస్తున్న లీడర్ల కొరత
– గ్రామస్థాయి బలోపేతంలో నో అప్డేట్!
– ఎన్ని సర్వేలు చేసినా షాకింగ్ విషయాలే!
– కానీ, మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి
– నిజంగా బీజేపీ బలపడిందా?
ఎప్పుడు ఎన్నికలొచ్చినా సిద్ధం.. గెలిచేది బీజేపీనే.. తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేస్తా.. బీజేపీ నేతలు ఏ ప్రోగ్రాంలో పాల్గొన్నా చెప్పేవి ఇవే. మరి.. బీజేపీ గ్రామస్థాయిలో బలోపేతం అయ్యిందా? అన్ని నియోజకవర్గాలకు సరైన అభ్యర్థులు ఉన్నారా? అంటే మాత్రం బీజేపీ వర్గాలు మౌనం వహిస్తున్నాయని అంటున్నారు రాజకీయ పండితులు. ఇతర పార్టీల నుంచి చేరికలు భారీగా ఆశించి కవర్ చేద్దామని అనుకున్నా.. ఊహించని విధంగా జంపింగ్ నేతలు ఝలక్ ఇవ్వడంతో కమలనాథులు అయోమయంలో పడ్డారని చెబుతున్నారు.
ఆపరేషన్ సౌత్ పైనే ఎక్కువ దృష్టి.. కానీ!
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఎంపీ సీట్లు భారీగా తగ్గుతాయనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలోనే కమలం పెద్దలు ఆపరేషన్ సౌత్ చేపట్టారని అంటున్నారు విశ్లేషకులు. గతేడాది జూలైలో జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహించారు. ఏదో ఒక హడావుడి ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. కానీ, రాష్ట్ర నేతలు చెబుతున్నదానికి జరుగుతున్నదానికి చాలా తేడాగా జరుగుతోందని వివరిస్తున్నారు. ఢిల్లీ పెద్దలు తరచూ రాష్ట్రానికి వస్తారని అనడమే గానీ.. టూర్లు వాయిదా పడుతూనే ఉన్నాయి. పైగా, సభలు, సమావేశాలు అని చెప్పడమే తప్ప.. అంతంతమాత్రంగానే జరుగుతున్నాయని అంటున్నారు.
ఉప ఎన్నికల్లో గెలుపు.. అభ్యర్థులదే..!
గత ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన సీట్లు ఒకటి. అదే గోషామహల్ నియోజకవర్గం. హేమాహేమీలు అని చెప్పుకున్న చాలామంది నేతలకు ఓటమి తప్పలేదు. అయితే.. లోక్ సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు దక్కించుకోవడం బీజేపీకి బూస్టప్ ఇచ్చింది. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటడం, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలవడంతో ఇక తిరుగులేదని రాష్ట్ర నాయకత్వం భావించింది. ఏదో ఒక హడావుడి ఉండేలా ప్లాన్ చేసుకుంది. అయితే.. ఇదే స్పీడ్ లో మునుగోడు ఉప ఎన్నికకు వెళ్లింది. కానీ, అక్కడ ఊహించని షాక్ తగిలింది. దీంతో బీఆర్ఎస్ వర్గాలు బీజేపీని ఓ ఆటాడుకున్నాయి. ఇటు విశ్లేషకులు కూడా రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు క్రెడిట్ అభ్యర్థులకే ఇచ్చారు.
సర్వేల్లో సంచలన వాస్తవాలు
ఈమధ్యే ఇండియా టుడే – సీ ఓటర్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో రాష్ట్రంలో బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు వస్తాయని చెప్పింది. అయితే.. తాజాగా కూడా అదే సంఖ్య చెప్పడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా పరిస్థితి ఉందని అంటున్నారు విశ్లేషకులు. అన్ని వర్గాల ప్రజలకు దగ్గరవ్వాలని కేంద్ర పెద్దలు చెబుతున్నా కూడా.. కొందరు నేతల తీరు అందుకు భిన్నంగా ఉండడంతో గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం కావడం లేదని అంచనా వేస్తున్నారు. ఇటు ఇతర సర్వేల్లోనూ బీజేపీకి వ్యతిరేక రిజల్స్టే వస్తున్నాయని చెబుతున్నారు.
ముదురుతున్న కోల్డ్ వార్
ఈమధ్య కాలంలో రాష్ట్ర బీజేపీ నేతల మధ్య సఖ్యత చెడిందనే ఆరోపణలు ఉన్నాయి. గ్రూపులుగా విడిపోయి.. పార్టీని ఎదగకుండా సొంత లాభం చూసుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే కొందరు అగ్ర నేతలు రాష్ట్ర నేతలకు క్లాస్ తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయినా కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని అంటున్నారు విశ్లేషకులు. కొద్ది రోజుల క్రితం కోవర్టుల విషయంలో ఈటల చేసిన వ్యాఖ్యలు.. అందుకు భిన్నంగా ఇతర నేతలు మాట్లాడింది చూశాక.. పార్టీలో ఏదో జరుగుతోందనే అనుమానానికి మరింత ఆజ్యం పోసినట్లయిందని వివరిస్తున్నారు.
ముందస్తు వస్తే.. ఏం చేస్తారు..?
ఓవైపు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలతో బీఆర్ఎస్ దూకుడుగా కనిపిస్తోంది. కేసీఆర్ స్పీడ్ చూసి ముందస్తు ఎన్నికలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. అయితే.. బండి సంజయ్ కూడా తాము ముందస్తుకు సిద్ధమని అన్నారు. కానీ, సరైన అభ్యర్థులే లేని ఈ సమయంలో నిజంగా ముందస్తుకు వెళ్తే.. బీజేపీకి నష్టమే అని చెబుతున్నారు విశ్లేషకులు. త్వరగా చేరికలను స్పీడప్ చేసుకుంటే అనుకున్న లక్ష్యాలు నెరవేరే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.