పవన్ సినిమాల్లో నటించడమే కరెక్ట్ అన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. మొట్టమొదట కలిసినప్పుడే పవన్ కు ఆ విషయం చెప్పానని, సీఎం అవుతానని అప్పుడు సినిమాలు వద్దనుకొని… ఇప్పుడు నాలుగేళ్లు సమయం ఉండటంతో మనస్సు మార్చుకున్నట్లున్నాడంటూ ఉండవల్లి సెటైర్స్ వేశారు. ఏపీ రాజకీయాలకు సంబంధించి అనేక అంశాలపై స్పందించిన ఆయన, పవన్ కల్యాణ్ సినీ రీఎంట్రీ అంశంపై మాట్లాడుతూ పవన్ సినిమాల్లో నటించాలని మొట్టమొదట కలిసినప్పుడే చెప్పానని, వాళ్ల ప్రధాన వృత్తి అదే కాబట్టి సినిమాలు మాత్రం ఆపొద్దని సూచించానని చెప్పారు.
జనసేన, బీజేపీల మధ్య పొత్తు గురించి స్పందిస్తూ పవన్ అధికారంలో లేడు కాబట్టి ఎవరితో పొత్తు పెట్టుకున్నా పర్వాలేదని అన్నారు. పొత్తులకు సిద్ధాంతాలతో పనేముందని ఉండవల్లి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టులు, వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండొచ్చని, పవన్ కల్యాణ్ పరిస్థితి పెద్దగా తేడా లేదని అభిప్రాయపడ్డారు.